సమాజంలోని కొందరు తమకున్న ఉన్న దాంట్లో ఎంతో కొంత పేదలకు దానం చేస్తారు. కొందరు మాత్రం ఉన్నదంతా విరాళాల రూపంలోనే ఇస్తుంటారు. ఆ యాచకురాలు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాల వద్ద యాచిస్తుంది. అలా వచ్చిన సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. అయితే ఆ సొమ్మును ఆమె తన సొంతానికి వాడుకోదు. ఆ మొత్తాన్ని మళ్లీ ఆలయాలకే విరాళంగా ఇస్తుంటుంది. ఆలయాల్లో మధ్యాహ్నం అన్నదానం చేస్తారు కదా. ఆ అన్నదానాల కోసం ఆమె ఆ మొత్తాన్ని ఇస్తుంటుంది. ఆమే.. కర్ణాటకకు చెందిన అశ్వత్తమ్మ.
అశ్వత్తమ్మ అయ్యప్ప స్వామి భక్తురాలు. ఈ సీజన్‌లో చాలా రోజుల ముందు నుంచే ఆమె అయ్యప్ప మాలను ధరిస్తుంది. ఫిబ్రవరి నెలలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటుంది. అయితే దర్శనానికి ముందు ఆమెకు ఆలయాలకు విరాళాలు ఇవ్వడం అలవాటు. అందులో భాగంగానే ఆమె తాజాగా సాలిగ్రామ అనే ప్రాంతంలోని శ్రీ గురు నరసింహ స్వామి ఆలయానికి రూ.1 లక్ష విరాళం అందజేసింది.
అయితే కేవలం ఆ ఒక్క ఆలయం మాత్రమే కాదు. ఆమె ఇప్పటి వరకు అలా అనేక ఆలయాలకు సుమారుగా రూ.5 లక్షల వరకు విరాళాలు ఇచ్చింది. ఆమె యాచకురాలిగా జీవనం సాగిస్తూనే తనకు ఆ వృత్తి ద్వారా వచ్చే మొత్తాన్ని విరాళాల రూపంలోనే ఇస్తుంటుంది. ఈ క్రమంలో ఆమెను స్థానికులు ఎప్పటికప్పుడు ప్రశంసిస్తుంటారు.