పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పేరిట పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రపై బీజేపీ ఘాటుగా విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ చేసిన విమర్శలపై కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. గతంలో రాహుల్‌ను ఉద్దేశించి హిమంత చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీకి జాగ్రత్త చెప్పింది.
హిమంత బిశ్వ 2010లో.. ‘తగిన సమయంలో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారు. అప్పుడు మేం ఆయన్ను కలుసుకోవడానికి అపాయింట్‌మెంట్ కోరాల్సి ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ.. ‘నరేంద్ర మోదీ జీ.. హిమంత ఎవరిని మోసం చేస్తున్నారు? అతనితో జాగ్రత్తగా ఉండండి. అయినా, మోసం చేసేందుకు మీరు వీలు కుదరనివ్వరులే’ అంటూ కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ ఘాటుగా స్పందించారు. హిమంత.. 2015లో రాహుల్‌ను తప్పుపడుతూ కాంగ్రెస్‌ను వీడారు. తర్వాత భాజపాలో చేరారు. అప్పటినుంచి రాహుల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు.