గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యను కస్టడీకి ఇవ్వాలని మంగళగిరి కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పరారీలో ఉన్న చైతన్య సోమవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపైన జరిగిన దాడి కేసులను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసులో మంగళగిరి పోలీసులు మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో పాటు 25మంది వైసీపీ నేతలను అరెస్టు చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్‌ను సైతం విచారించారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో తాడేపల్లి పోలీసులు మాజీమంత్రి జోగి రమేష్ తోపాటు పలువురిని విచారించి, పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా.. ఈ కేసు విచారణ ఆలస్యంగా సాగుతోందని ఏపీ సర్కార్ సీఐడీకి బదిలీ చేసింది.