భారతీయ సంప్రదాయ పండుగల్లో హోళీ కూడా ఒకటి. దేశమంతటా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. ఆటలు, పాటలతో ఎంతో ఉత్సాహంగా హోళీ పండుగ జరుపుకుంటారు. అయితే, ఈ సందర్భంగా పూసుకునే రంగులతో జనం చర్మ సమస్యలు, కంటి సమస్యల బారిన పడుతున్నారు. హానికర రసాయనాలతో తయారయ్యే సింథటిక్ రంగులే ఇందుకు కారణమవుతున్నాయి. అందుకే సింథిటిక్ కలర్స్‌కు బదులుగా సహజ రంగులను (హెర్బల్ కలర్స్‌ను) ఉపయోగించడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
మొదట్లో వైద్యుల సూచనలను జనం అంతగా పట్టించుకోకున్నా.. క్రమంగా అవగాహన పెరుగుతూ వచ్చింది. అదే క్రమంలో మార్కెట్లో సహజ రంగులకు డిమాండ్ పెరుగుతూ వస్తున్నది. దీంతో హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో హెర్బల్ కలర్స్ విక్రయాలు జోరందుకున్నాయి. సింథటిక్ కలర్స్‌తో పోల్చినప్పుడు సహజరంగుల ధర కొంచెం ఎక్కువైనా ఆరోగ్యం కోసం ఆ మాత్రం ఖర్చు చేయడానికి జనం వెనుకాడటంలేదు.
కాగా, పూర్వకాలంలో హోళీ వేడుకలకు వారం, పది రోజుల ముందు నుంచే హోళీ రంగుల తయారీ ప్రక్రియ ప్రారంభమయ్యేది. చెట్ల పూత, ఆకులు, వేర్లు సేకరించి సహజసిద్ధమైన హోళీ రంగులను తయారు చేసేవారు. కాషాయం రంగులో కనువిందుగా కనిపించే మోదుగు పూలను ఈ సహజ రంగుల తయారీలో ఎక్కువగా ఉపయోగించేవారు.
పల్లెల్లో పిల్లలు, యువత తమ వ్యవసాయ క్షేత్రాల్లోని చెట్ల నుంచే ఆకులు, పూలు సేకరించి సొంతంగా సహజ రంగులను (హెర్బల్ కలర్స్) తయారు చేసుకునేవారు. ఈ రంగుల తయారీతో పల్లెల్లో చాలా మందికి ఉపాధి కూడా లభించేది. కొంతమంది అటవీ ప్రాంతాల నుంచి సేకరించి తెచ్చిన పత్రాలు, పూలను చిరువ్యాపారులకు విక్రయించేవారు. వాటిని కోనుగోలు చేసిన వ్యాపారులు కూలీల సాయంతో సహజరంగులను తయారు చేయించేవారు.
ఇలా తయారు చేయించిన రంగులను పల్లెల్లో విక్రయించడంతోపాటు పట్టణ ప్రాంతాలకు కూడా సరఫరా చేసేవారు. అయితే రానురాను గ్రామాల్లో సాగు భూముల పరిమాణం పెరిగి బీడు భూముల పరిమాణం తగ్గిపోయింది. దాంతోపాటే రంగుల తయారీకి కావాల్సిన సామాగ్రిని ఇచ్చే చెట్లు, మొక్కలు మాయమ్యాయి. దీంతో సహజరంగుల తయారీ క్రమంగా కనుమరుగైంది.
ఇదే సమయంలో చైనా నుంచి భారత మార్కెట్లకు నిదానంగా మొదలైన సింథటిక్ రంగుల ప్రవాహం క్రమంగా ఊపందుకుంది. ఒక దశలో హోళీ పండుగ వచ్చిందంటే ఎక్కడ చూసినా చైనా రంగులే దర్శనమిచ్చేవి. అయితే, ఈ సింథటిక్ రంగులు అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుండటంతో.. జనం ఇప్పుడు మళ్లీ హెర్బల్ కలర్స్‌వైపు మొగ్గు చూపుతున్నారు. సింథటిక్ రంగులు వద్దు.. సహజ రంగులే ముద్దు అంటున్నారు.
జనంలో వచ్చిన ఈ మార్పు వ్యాపారులపాలిట వరంగా మారింది. మునుపటిలా ఎవరికి వారు సహజ రంగులు తయారు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో అందరూ మార్కెట్ల నుంచే కొనుగోలు చేస్తున్నారు. దీంతో హెర్బల్ కలర్స్ విక్రయదారులు లాభాల పంట పండించుకుంటున్నారు. ఏదైమైనా జనం హోళీ పండుగ కోసం సహజరంగుల వైపు మొగ్గుచూపడం శుభ పరిణామమే కదా!