అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన జరగనున్న రామ మందిర నిర్మాణ భూమి పూజకు కావల్సిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. ఈ క్రమంలో భూమి పూజతోపాటు అదే రోజున అయోధ్యలో రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను కూడా మోదీ ప్రారంభిస్తారు. అయితే మరోవైపు అయోధ్యకు వచ్చే భక్తులు, టూరిస్టుల కోసం అక్కడి రైల్వే స్టేషన్‌ను కూడా అన్ని హంగులతో పునర్నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మికత, ఆధునికత ఉట్టిపడేలా అయోధ్య రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు నార్తర్న్ రైల్వే విడుదల చేసిన అయోధ్య రైల్వే స్టేషన్ నమూనా చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
అయోధ్య రైల్వే స్టేషన్ మొదటి దశ నిర్మాణ పనులు జూన్ 2021 వరకు పూర్తవుతాయి. అయోధ్య ఆలయాన్ని 2023-24 వరకు పూర్తి చేయనున్న నేపథ్యంలో అంతకు ముందుగానే రైల్వే స్టేషన్‌ను పూర్తి స్థాయిలో పునర్నిర్మించి అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ యత్నిస్తోంది. ఇక రైల్వే స్టేషన్‌కు వచ్చే భక్తులు, టూరిస్టులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో అయోధ్య రైల్వే స్టేషన్ పనులకు రైల్వే శాఖ రూ.80 కోట్ల బడ్జెట్‌ను కేటాయించగా.. ప్రస్తుతం దాన్ని రూ.104.77 కోట్లకు పెంచారు. ఆర్ఐటీఈఎస్ ఎంటర్‌ప్రైజ్ ఆఫ్ రైల్వేస్ అయోధ్య రైల్వే స్టేషన్ పనులను చేపడుతోంది.
అయోధ్య రైల్వే స్టేషన్ పనులను 2 దశల్లో పూర్తి చేస్తారు. మొదటి దశలో ప్లాట్‌ఫాం నంబర్ 1, 2/3 లను అభివృద్ధి చేస్తారు. తరువాత 2వ దశలో కొత్త స్టేషన్ భవనాన్ని నిర్మిస్తారు. అలాగే అందులో ఇతర సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో స్టేషన్, బయట లోపల ప్రాంగణాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతారు. టిక్కెట్ కౌంటర్ల స్థలాన్ని విస్తరిస్తారు. వెయిటింగ్ రూంలను అదనంగా ఏర్పాటు చేస్తారు. కొత్తగా 3 ఏసీ వెయిటింగ్ రూంలు, 17 బెడ్లు ఉన్న మేల్ డార్మిటరీ గదులు, 10 బెడ్లు ఉన్న ఫీమేల్ డార్మిటరీ గదులను నిర్మిస్తారు. వాటిల్లో మరుగుదొడ్ల సదుపాయం ఉంటుంది.
స్టేషన్‌లో అదనంగా మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జితోపాటు ఫుడ్ ప్లాజా, షాపులు, అదనపు టాయిలెట్లు, ఇతర అవసరమైన సౌకర్యాలకు కావల్సిన నిర్మాణాలు చేపడుతారు. ఇవే కాకుండా టూరిస్టు సెంటర్, ట్యాక్సీ బూత్, వీఐపీ లాంజ్, ఆడిటోరియం, స్పెషల్ గెస్ట్ హౌజ్ తదితర నిర్మాణాలను కూడా స్టేషన్ సమీపంలో చేపడుతారు.
देश के करोड़ो लोगो की आस्था के प्रतीक श्री रामजन्मभूमि मंदिर के दर्शन करने आने वाले श्रद्धालुओं के लिये प्रधानमंत्री @NarendraModi जी के नेतृत्व में रेलवे कर रहा है अयोध्या स्टेशन का पुनर्विकास। pic.twitter.com/MNgzKR7PY6
— Piyush Goyal (@PiyushGoyal) August 2, 2020