ఢిల్లీలోని సౌత్ జోన్ మాలవీయనగర్ ప్రాంతంలో కాంతా ప్రసాద్, బాదామీ దేవి దంపతులు ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. వీరు చిన్న దాబా లాంటిది పెట్టుకుని జీవితం సాగిస్తున్నారు. చిరుద్యోగులు, రిక్షా, ఆటోకార్మికులు, రోజు కూలీలు వీరి వద్ద టిఫిన్ చేసేవారు. లాక్ డౌన్ ముందు వరకూ వారికి వ్యాపారం బాగా జరిగినా కరోనా వైరస్, లాక్ డౌన్ తో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా జనం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అయితే వీరి దీనావస్థను ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్.. అక్టోబర్ 7న తన యూట్యూబ్ చానల్ లో వీరి గురించి వీడియో అప్‌లోడ్ చేశాడు. తినేవాళ్లు రాకపోవడంతో, వ్యాపారం జరగక, పూట గడవడమే కష్టంగా ఉందని ఆ వీడియోలో ప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యాడు. అతి తక్కువ ఖర్చుతో రుచికరమైన లంచ్ చేయండి, వృద్ధ దంపతులను ఆదుకోండి, అంటూ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరగడంతో ఆయన షాప్ కి జనాలు క్యూ కట్టారు. అయితే ఇప్పుడు తన వీడియో తీసిన వాసన్ మీద ప్రసాద్ కంప్లైంట్ ఇచ్చాడు. తన పేరిట డొనేషన్స్ వసూలు చేశాడని, వాటికి లెక్కలు కూడా చెప్పడం లేదని చెబుతూ పోలీసులకి ఆయన ఫిర్యాదు చేశాడు.