తెలంగాణ రాజకీయాల్లో సినీ నటుడు బాబూమోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఆయన మంచి విజయాలు అందుకుని మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్టీఆర్ పై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరి..కీలక నేతగా ఎదిగారు. 1998 ఆందోల్ ఉపఎన్నికలో సత్తా చాటారు. అదే ఊపులో 1999 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. అలాగే చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
ఇక 2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన బాబూమోహన్..తెలంగాణ ఎఫెక్ట్ తో టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2014లో బిఆర్‌ఎస్ తరుపున ఆందోల్ నుంచి గెలిచారు. కానీ ఆయన గెలిచాక అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఎక్కడకక్కడ నోరు పారేసుకోవడం, కార్యకర్తలని తిట్టడం, ప్రశ్నించిన వారిపై విరుచుకుపడటం చేశారు. దీంతో ఆయనకు నెగిటివ్ పెరిగింది. మళ్ళీ సీటు ఇస్తే గెలవరని అంతర్గత సర్వేల్లో తేలింది. దీంతో కేసిఆర్..ఆయనని తప్పించి ఆందోల్ సీటు క్రాంతి కిరణ్‌కు ఇచ్చారు. దీంతో బాబూమోహన్..బిఆర్‌ఎస్ పార్టీని వీడి బిజేపిలో చేరారు.
అయితే బిజేపికి పెద్ద బలం లేని విషయం తెలిసిందే..అలాగే 2018 ఎన్నికల్లో బాబూమోహన్ సొంత బలం ఏంటో కూడా తేలిపోయింది. ఆందోల్ బరిలో కేవలం 2404 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. ప్రస్తుతం బిజేపిలో కొనసాగుతున్న తాజాగా..మరో వివాదంలో చిక్కుకున్నారు. జోగిపేట బీజేపీ కార్యకర్తపై బూతు పురాణంతో విరుచుకుపడ్డారు. బాబుమోహన్‌కి ఫోన్ చేసిన బీజేపీ కార్యకర్త వెంకటరమణను ఫోన్లో పరుషపదజాలంతో తిట్టారు. ‘‘నువ్వెంత, నీ బతుకెంత..నువ్వు గల్లి లీడర్..నేను రాష్ట్ర నాయకుడిని..మన ఇద్దరి ఓటు బ్యాంక్ ఎంతో చూసుకుందాం’’ అంటూ కార్యకర్త వెంకటరమణపై బాబూమోహన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
దానికి సంబంధించి ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ బాబూమోహన్‌కు డిపాజిట్ పోవడం ఖాయమని కామెంట్లు వస్తున్నాయి.