ఎంత అధికారంలో ఉన్నా.. ఎన్ని అధికారాలు ఉన్నా.. కాలం అనేది కలిసి రాకపోతే.. ఎలా ఉంటుందో.. ఏపీ సీఎం జగన్‌ను చూస్తే తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు ప్రజాసంక్షేమంలో దూసుకుపోతూ.. మరోవైపు సంచలన నిర్ణయాలు తీసు కుంటూ.. రాష్ట్ర ప్రభుత్వ సరళినే మార్చేసిన, మార్చుకుంటూ… పోతున్న జగన్‌కు ఇప్పుడు భారీ ఎదురు దెబ్బతగిలింది. అది కూడా తాను ఎంతో ప్రయత్నించిన చేసిన ఓ కీలక నిర్ణయం తర్వాత కూడా ఆయన అనుకున్నది సాధించలేక పోయారనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే జగన్ పెట్టుకున్న కీలక లక్ష్యం. వాస్తవానికి స్థానిక ఎన్నికలను చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేయాల్సి ఉంది.
కానీ, అప్పట్లో ఆయన ప్రత్యేక అధికారులను నియమించి.. ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ..వచ్చారు. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మార్చి 31 నాటికి ఈ ఎన్ని కల ను పూర్తి చేసితీరాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జగన్ కూడా ఎన్నికల కు సమాయాత్తమయ్యారు. ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. ఇంతలోనే కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయడం తెలిసిందే. అయితే, ప్రభుత్వానికి మాట మాత్రం కూడా చెప్పకుండా.. ఇంకా ప్రభావమే లేని కరోనాను కారణంగా చూపిస్తూ.. ఎన్నికలు వాయిదా వేయడం ఏంటని ఆగ్ర హించిన జగన్.. ఏకంగా ఆర్డినెన్స్ తెచ్చి అప్పటి ఎన్నికల కమిషనర్ పదవీ కాలం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు.
ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన మాజీ జస్టిస్ కనగరాజ్‌ను తెచ్చి ఏపీ ఎన్నికల కమిషన్ కు కమిషనర్‌గా నియమించారు. దీంతో ఎంతో కొంత ఉపశమనం కలుగుతుందని, త్వరలోనే స్థానిక ఎన్నికలు పూర్తవుతాయని, తనకు తలనొప్పి తగ్గుతుందని, ప్రభుత్వ వ్యూహం సక్సెస్ అవుతుందని భావించారు జగన్. అయితే, తాజాగా ఆయనకు కనగరాజ్ నుంచి కూడా తీవ్ర ఎదురు దెబ్బతగిలింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎస్‌ఈసీ కనగరాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ నిర్ణయంతో జగన్ వ్యూహానికి భారీ దెబ్బతగిలినట్టేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని కూడా కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.