ఒకపక్క బాలినేని… మరోపక్క అంబటి… వాచిపోతున్నాయంట!

-

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి టీడీపీ నేత‌ల‌కు స‌వాల్ విసిరారు. టీడీపీ తమ్ముళ్లే నోరెళ్లబెట్టేలా.. ఆ పార్టీలోని నేతలు చెన్నై-ఏపీ బోర్డర్ లో దొరికిన డబ్బు మంత్రి బాలినేనిదే అని తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అందుకు బాలినేని తీవ్రంగా స్పందించారు. ఓ రకంగా ఛాలెంజ్ విసిరారు. అదేమంటే… “నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక మచ్చ కూడా లేదు.. దొరికిన డబ్బులు నావి అని.. టీడీపీ నేత‌ బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు నిరూపిస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.. అంతేకాదు రాజ‌కీయాల నుంచి కూడా త‌ప్పుకుంటాను” అంటూ తీవ్రంగా స్పందించారు. అలాగే… బోండా ఉమ కూడా తనపై విమర్శలు చేయ‌డానికి సిగ్గు ఉండాలంటూ మండిపడ్డ బాలినేని.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన బోండా ఉమ. క్షమాపణలు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా నారా లోకేష్‌ పై కూడా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బాలినేని. ముఖ్యంగా.. లోకేష్ ‌కు తనను విమర్శించే స్థాయి లేద‌ని.. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాన‌ని కూడా వివరించారు. అలాగే… తాను తలచుకుంటే ప్రకాశం జిల్లాలో టీడీపీ లేకుండా చేస్తాను అంటూ బాలినేని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రధాని మోడీ జుట్టు పట్టుకోవాలని చూసిన చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం కాళ్లు పట్టుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై 52 పేజీల తప్పుడు ఆరోపణలతో రాష్ట్రపతికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారని.. ప్రభుత్వంపై బురదచల్లడమే కాకుండా… వారిపై తాము కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్టు వాపోతున్నారని విమర్శించారు.

ముఖ్యంగా అవినీతి లేని పాలనను అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని తెలిపిన ఆయన… అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డిలు తప్పు చేయకుండానే, ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఒక వ్యక్తిని హత్య చేసేందుకు సహకరించిన కొల్లు రవీంద్రను వదిలిపెట్టాలా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అలాగే.. జేసీ ప్రభాకర్ రెడ్డి అవినీతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని.. రూ.151 కోట్ల అవినీతికి పాల్పడిన అచ్చెన్నను ఏమీ చేయవద్దా? అంటూ ఫైర్ అయ్యారు. కాగా విచారణలో తప్పులు భయటపడతాయనే భయంతోనే రాష్ట్రపతికి లేఖలు ఇస్తున్నారని అంబటి పంచ్ లు విసిరారు. టీడీపీ నేతలు అంత బెంబేలెత్తాల్సిన అవసరం ఏమిటని విమర్శనాస్త్రాలు సంధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version