దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ సర్వే శాస్త్రీయంగా జరుగుతుందని, దీనివల్ల కులాలవారీగా ఖచ్చితమైన డేటా అందుబాటులోకి వచ్చి రిజర్వేషన్లలో న్యాయం జరగే అవకాశం ఉందన్నారు.
కుల గణనపై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్, ‘‘కేంద్రం నిర్ణయాన్ని తమ విజయంగా చెప్పుకోవడం సిగ్గుచేటు’’ అన్నారు. స్వాతంత్రం తర్వాత ఎన్నడూ దేశవ్యాప్తంగా కుల గణన జరగనివ్వని కాంగ్రెస్ పార్టీకి దీనిపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 2010లో అనేక పార్టీల డిమాండ్‌కు స్పందిస్తూ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు కేవలం ఓ సర్వేనే చేపట్టిందన్నారు.
మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ ఘనత అయితే, గతంలో డూప్లికేట్ గాంధీల నేతృత్వంలో ఎందుకు కుల గణన జరగలేదో రాహుల్ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన కులగణనల్లో పారదర్శకత లేదని, కొన్ని కులాల జనాభాను వక్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీనివల్ల సామాజిక అసమతుల్యత పెరిగిందన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం సమగ్రంగా, రాజకీయ రహితంగా కుల గణన చేపట్టే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ, అన్ని పార్టీలు, కుల సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు ఈ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.