నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తాజాగా స్పందించారు.మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. క్వింటాలు పసుపుకు రూ.15వేల ధర కల్పిస్తామని ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ గురించి ప్రశ్నించారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తెచ్చామని చెప్పుకుంటున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని ఫైర్ అయ్యారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేక రైతులకు ప్రయోజనాలు అందడం లేదన్నారు. పసుపునకు మద్దతు ధర పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వెంటనే ఆ హామీని నిలబెట్టుకోవాలని ఆమె బండి సంజయ్‌ను నిలదీశారు.