TSPSC క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. పేపర్ లీక్ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమేనంటూ మండిపడుతున్నారు.
మరోవైపు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ ఘటనను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ నిరసన దీక్ష చేయనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా పార్టీ నాయకులతో కలిసి దీక్ష చేస్తారు.
క్వశ్చన్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ బండి సంజయ్ ఇదివరకే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో వైఫల్యమైన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష పరిహారం ఇవ్వాలనే డిమాండ్లతో బండి నిరసన దీక్షకు పూనుకోనున్నారు.