తెలంగాణ మదర్సాలలో బంగ్లాదేశీయులు ఉంటున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కొత్త మదర్సాలు పుట్టుకువస్తున్నాయని, వాటిలో ఎన్నింటికి అనుమతులు ఉన్నాయో వివరాలు చెప్పాలని సీఎం రేవంత్‌కు లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు.
శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మదర్సాల్లో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యక్రమాలపైన నియంత్రణ ఎవరికి ఉందో అధికారులు ఎవరూ చెప్పడం లేదన్నారు. అందుకే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నామని తెలిపారు. త్వరలోనే గవర్నర్ ను ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి ఈవిషయాన్ని తీసుకువెళతామని చెప్పారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం, సంగారెడ్డి-సదాశివపేట మధ్య హైవే మీద ఉన్న మదర్సా విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు.జిన్నారం మదర్సాలో మొత్తం 70 మంది విద్యార్థులు చదువుతుంటే అందులో 65 మంది విద్యార్థులు బిహార్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ జిల్లాకు చెందిన వారు ఉన్నారని, వీరికి చదువు చెప్పే ఉపాధ్యాయులు సైతం కిషన్ గంజ్‌కు చెందిన వారేనని అన్నారు.