దారుణం.. కేవలం రూ.3 లోన్‌ చెల్లించాలని.. 15 కిలోమీటర్లు నడిపించారు..

-

కర్ణాటకలో ఓ బ్యాంకు అధికారులు చేసిన నిర్వాకం తాజాగా బయటపడింది. కేవలం రూ.3.46 లోను పెండింగ్‌లో ఉంది.. చెల్లించాలని ఓ రైతును పాపం ఏకంగా 15 కిలోమీటర్లు నడిపించారు. కర్ణాటకలోని శిమోగా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

bank officials made farmer walk for 15 kilo meters to get loan repayment of rs 3

షిమోగాలోని బరువె గ్రామానికి చెందిన ఆమందె లక్ష్మీనారాయణ బ్యాంకు నుంచి రూ.35వేల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. ప్రభుత్వం రూ.32వేలు రుణమాఫీ చేసింది. దీంతో పెండింగ్‌లో ఉన్న రూ.3వేలను అతను కొద్ది రోజుల కిందటే చెల్లించాడు. అయితే బ్యాంకులో చెల్లించాల్సిన లోన్‌ ఇంకా పెండింగ్‌లో ఉందని వెంటనే రావాలని బ్యాంకు అధికారులు లక్ష్మీనారాయణకు ఫోన్‌ చేశారు. కానీ ఎంత లోన్‌ పెండింగ్‌లో ఉందో అతనికి చెప్పలేదు. తీరా అతను బ్యాంకుకు వెళ్లే సరికి పెండింగ్‌లో ఉన్న లోన్‌ మొత్తం తెలుసుకుని అతను షాక్‌ తిన్నాడు.

కేవలం రూ.3.46 మాత్రమే లోన్‌ పెండింగ్‌లో ఉందని తెలుసుకున్న లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. వెంటనే ఆ మొత్తాన్ని కూడా చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే బ్యాంక్‌ నుంచి కాల్‌ రాగానే అతను హుటాహుటిన అక్కడికి బయల్దేరాడు. టైముకు రవాణా సదుపాయం కూడా అతనికి లభించలేదు. దీంతో అతను తన ఇంటి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకు మండుటెండలో కాలినడకన వెళ్లాడు. అయినప్పటికీ అంత తక్కువ మొత్తం లోన్‌ పెండింగ్‌లో ఉందని తెలుసుకుని అతను ఖంగు తిన్నాడు. అయితే దీనిపై ఆ బ్యాంకు అధికారులను ప్రశ్నించగా.. తమ బ్యాంకులో ఆడిటింగ్‌ జరుగుతుందని, ఆ రైతు సంతకం కోసమే అతన్ని తమ బ్యాంకుకు పిలిచామని సమర్థించుకునే యత్నం చేశారు. అయితే దీనిపై స్థానికులు మాత్రం మండిపడుతున్నారు. అంత తక్కువ మొత్తానికి అతన్ని హుటాహుటిన 15 కిలోమీటర్ల దూరం నడిపించాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. అవును మరి.. బ్యాంకు అధికారులంటే అంతే.. బడాబాబులకైతే వారి ఇళ్లకు వెళ్లి మరీ, వారి కాళ్ల మీద పడి సేవలు చేసి తరించిపోతారు. కానీ పేదల విషయానికి వస్తే.. ఇదిగో.. పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎప్పుడు మారుతారో.. అంతా మన ఖర్మ కాకపోతే..!

Read more RELATED
Recommended to you

Latest news