భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. అంతా ఊహించినట్లుగానే రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. బుధవారం రోజు (జూన్ 5వ తేదీ) ప్రారంభమైన ద్వైమాసిక ద్రవ్యపరపతి కమిటీ విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం (జూన్ 7వ తేదీ) వెల్లడించారు.
2023 ఏప్రిల్ నుంచి రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది. కాగా, రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా ఎనిమిదోసారి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ప్రకటించిన రెండో ద్వైమాసిక పరపతి విధానం ఇది. ఇంధన ధరల్లో ప్రతిద్రవ్యోల్బణం నమోదవుతోందని ఆయన తెలిపారు. అయినా ధరల పెరుగుదలపై ఎంపీసీ అప్రమత్తంగా ఉందని చెప్పారు. ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యత అనుకూలంగా ఉందన్న శక్తికాంత దాస్.. ఆహార ద్రవ్యోల్బణమే కొంత వరకు ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.