భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రముఖ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను ప్రఖ్యాత రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ చేసింది. 2019 సంవత్సరానికి గాను బీసీసీఐ రోహిత్ శర్మ పేరును ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ సంస్థ శనివారం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్, దీప్తి యాదవ్‌ల పేర్లను అర్జున అవార్డుకు ఎంపిక చేసింది.
జనవరి 1, 2016 నుంచి డిసెంబర్ 31, 2019 వరకు రోహిత్ శర్మ 4 టీ20ఇంటర్నేషనల్ సెంచరీలను చేసిన మొదటి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. వన్డేలలో 150కి పైగా 8 సార్లు స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు. 2017 ఆరంభం నుంచి రోహిత్ ఏకంగా 18 వన్డే సెంచరీలు చేయగా.. అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ 4వ స్థానంలో నిలిచాడు. అతని ఖాతాలో ప్రస్తుతం 28 వన్డే సెంచరీలు ఉన్నాయి.
కాగా 2019 సంవత్సరానికి గాను రోహిత్ ఐసీసీ వన్డే క్రికెటర్‌గా కూడా ఎంపికయ్యాడు. ఇక ఒక వరల్డ్ కప్ టోర్నీలో 5 వన్డే సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్‌గా కూడా రికార్డులకెక్కాడు. అలాగే భారత గడ్డపై జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ ధోనీని అధిగమించాడు. ఇక ఆ తరువాత రోహిత్‌కు టెస్టుల్లో ఆడే అవకాశం లభించింది. ఈ క్రమంలో టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చిన తొలి మ్యాచ్‌లోనే రెండు సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా కూడా రోహిత్ నిలిచాడు.
ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్‌గా సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడని అన్నారు. ఇతర ప్లేయర్లకే సాధ్యం కాని స్కోర్లను అతను సాధించాడని కొనియాడారు. రోహిత్ శర్మ ఖేల్ రత్న అవార్డుకు అన్ని విధాలుగా అర్హుడని తాము భావిస్తున్నామని, అందుకనే అతని పేరును ఆ అవార్డుకు ప్రతిపాదించామని తెలిపారు.