ఇవాళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.టెస్టు మ్యాచ్ల ఫీజులను భారీగా పెంచుతూ బీసీసీఐ ప్రకటన జారీ చేసింది. ఇది వరకు ఒక టెస్టు ఆడిన క్రికెటర్ కి ఫీజు రూ.15 లక్షలు ఉండగా దాన్ని ఏకంగా రూ.45 లక్షలకు బీసీసీఐ పెంచింది. అయితే దీనికి కొన్ని నిబంధనలు పెట్టింది. ఒక సంవత్సరంలో 75% కంటే ఎక్కువ గేమ్ లు ఆడిన ఆటగాళ్లకు మ్యాచ్కు రూ.45 లక్షల ఫీజు చెల్లించనున్నట్లు బిసిసిఐ పేర్కొంది. 50 శాతం మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు రూ.30 లక్షలు ఇస్తారు. తుది జట్టులో లేని ప్లేయర్లకు రూ.22.5 లక్షలు (75%), రూ.15 లక్షలు (50%) దక్కుతాయి.
ఇదిలా ఉంటే….ధర్మశాల వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ పై ఇన్నింగ్స్ 64 రన్స్ తేడాతో ఇండియా ఘనవిజయం సాధించింది.ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ 218 పరుగులు చేయగా ఇండియా 477 పరుగులతో దీటుగా బదులిచ్చింది. 259 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 195 రన్స్ కే కుప్పకూలింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. దీంతో భారత్ 4-1 తేడాతో టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది.