బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు మరో 6 రోజుల్లో వెలువడనుంది. లెక్కింపు తేదీ జూన్ 4 సమీపిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు కేంద్రంలో ఎలాంటి తీర్పు వెలువడనుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీల అధినేతలతో పాటు ప్రధాన నేతల గెలుపోటములపై ఒక్కొక్కరు రూ.లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ కాయ్ రాజా కాయ్ జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటమికి కారణాలు వెతుకుతున్న వైసీపీ నేతలు ఈసీ, పోలీసులపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు.. ‘జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల, కౌంటింగ్ రోజున అప్రమత్తంగా ఉండాలి’ అని ఆయన సూచించారు. అటు శుక్రవారం పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో ఆయన భేటీ కానున్నారు.