రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకున్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌లలో కృష్ణాజిల్లాది అగ్రస్థా నం. అనేక బ్యాంకులు ఉన్నప్పటికీ.. ఈ బ్యాంకుకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణ లేక పోవడం గమనార్హం. ఎన్నో దశాబ్దాలుగా రైతులకు, చిన్న వ్యాపారస్తులకు రుణాలు ఇవ్వడంలో ముందున్న ఈ బ్యాం కు ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు సీఈవోగా ఉన్న ఎన్.రంగబాబు ఏసీబీకి చిక్కారు. దీంతో అసలు బ్యాంకులో ఏం జరుగుతోందనే విషయం చర్చకు వస్తోంది. రంగబాబు.. పది మాసాల కిందటే ఈ పదవిలోకి వచ్చారు. ఆయన వచ్చీ రాగానే బ్యాంకు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
అప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు పది మంది సిబ్బందిని ఆయన పక్కకు పెట్టారు. దీంతో వ్యవస్థను ప్రక్షాళన చేసే పని ప్రారంభమైంది. అదేసమయంలో బ్యాంకు కార్యకలాపాలు మరింత మెరుగ య్యాయనే భావన కూడా అటు రైతుల్లోనూ, ఇటు చిన్నపాటి వ్యాపారుల్లోనూ వచ్చింది. కానీ, ఇంతలోనే ఈసీవోపై ఏసీబీ దాడి చేయడం, ఆయన 2020 సంవత్సరానికి బ్యాంకు క్యాలెండర్లు, డైరీలు ముద్రించేందుకు కోసూరి లక్ష్మీనాంచారయ్యతో రూ.7.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకోవడం, ఈ మొత్తాన్ని ఇవ్వాలంటే తనకు రూ.లక్ష లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
ఈ లంచం ఇచ్చేందుకు అంగీకరించిన లక్ష్మీనాంచారయ్య ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రూ.లక్షను కవర్లో ఉంచి లక్ష్మీనాంచారయ్య మంగళవారం రంగబాబుకు ఆయన చాంబర్‌లో అందజేశారు. వెంటనే ఏసీబీ అధికారులు వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. పైకి అందరికీ కనిపిస్తున్న విషయం ఇదే. కానీ, రంగబాబును దగ్గరగా చూసిన, ఆయన కింద పనిచేసిన బ్యాంకు ఉద్యోగుల అభిప్రాయం వేరేగా ఉంది. ఆయన చాలా నిజాయితీపరుడని వారు అంటున్నారు. అంతేకాదు, బ్యాంకు కార్యకలాపాలను ప్రక్షాళన చేసే క్రమంలో అందరినీ గాడిలో పెట్టే క్రమంలో ఆయన కొన్ని చర్యలు తీసుకున్నారని, ఇవి కొందరికి కంటగింపుగా మారాయని చెబుతున్నారు.
ఇలా, బాధితులుగా మారిన కొందరు అవినీతి ఉద్యోగులు కావాలనే రంగబాబును ఇరికించారనే ప్రచారం బ్యాంకు వర్గాల్లో జోరుగా సాగుతోంది. అంతర్గత కార్యకలాపాలైనా.. ప్రజలతో సంబంధాలనైనా రంగబాబు నిజాయితీగా వ్యవహరించేవారని అంటున్నారు. అయితే, కొందరు ఉద్యోగులు ఆయనపై కక్ష కట్టి.. నాంచా రయ్యతో గూడుపుఠాణీ చేసుకుని, ఉద్దేశ పూర్వకంగానే రంగబాబుకు అవినీతిమరకలు అంటిస్తున్నారని అంటున్నారు. బ్యాంకు తరఫున డైరీలు, క్యాలెండర్లు ముద్రించేందుకు వచ్చిన సంస్థ ప్రతినిధితో రంగ బాబు కరాఖండీగా మాట్లాడినట్టు తెలుస్తోంది. మీకన్నా తక్కువ మొత్తానికి ఇచ్చేవారికి అవకాశం ఇస్తామని ఆయన చెప్పారని అంటున్నారు.
అయితే, కొన్నేళ్లుగా తామే కాలెండర్లు, డైరీలు ముద్రిస్తున్నామని, ఈ విషయంలో సహకరించాలని సదరు సంస్థ ప్రతినిధి రంగబాబుపై ఒత్తిడి తెచ్చారని, ఈ క్రమంలోనే గత చరిత్ర చూడాలంటూ.. ఆయన చేతిలో ఓ కవర్ పెట్టారని ప్రచారం సాగుతోంది. ఈ కవర్‌లో ఏముందనే విషయం రంగబాబుకు కూడా తెలియక పోవడం, తనపై ఇంత గూడు పుఠాణీ జరుగుతున్న విషయం గుర్తించలేక పోవడంతో ఆయన ఆ కవర్ తెరవడం, అందులోంచి రెండు వేల రూపాయల నోట్లు కిందకి జారడం, వాటిని ఆయన చేతితో పట్టుకోవడం, ఆవెంటనే ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేసి,రంగబాబుపై కేసు నమోదు చేయడం వంటి క్షణాల్లో జరిగిపోయాయని అంటున్నారు.
ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రేనని చెబుతున్నారు. నిజానికి లంచం తీసుకోవాలని రంగబాబు భావించి ఉంటే.. కేవలం లక్షతోనే సరిపెట్టుకుంటారా? అయినా ఆఫీస్‌లోనే లంచం తీసుకుంటారా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు లేక పోవడం గమనార్హం. ఏదేమైనా బ్యాంకులో తిష్టవేసిన కొందరు అవినీతి అధికారుల కారణంగానే రంగబాబు బలయ్యారనే బలమైన వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.