జనసేనాని పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ప్రకృతి ప్రేమికుడిగా మారిపోయారు. రాష్ట్రంలో వన రక్షణ పేరుతో ఓ మహా ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు. దీనిని ఎవరూ తప్పు పట్టడం లేదు. అయితే, ఈ క్రమంలోనే ఆయన ఫక్తు స్వామీజీ వేషం వేసుకున్నట్టుగా చేసిన వ్యాఖ్యలపైనే ఆశ్చర్యకరమైన చర్చ సాగుతోంది. ‘‘ఒక్కో రావి, వేప, మర్రి మొక్క.. పది రకాల పూల మొక్కలు.. ఐదు మామిడి మొక్కలు, రెండేసి దానిమ్మ, నారింజ మొక్కలు నాటినవారు నరకానికి వెళ్లరు. వేద వ్యాసుడు రాసిన ‘శ్రీ వరాహ పురాణం’లో ఈ విషయం ఉంది’’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
అంతేకాదు, భూదానం, గోదానం వల్ల ఎంత పుణ్యం వస్తుందో మొక్కలను నాటి సంరక్షించడం వల్ల అంతే పుణ్యం వస్తుందని ఈ పురాణం చెబుతోందని ఆయన పేర్కొన్నారు. అయితే, రాజకీయాల్లో ఉన్నవారు ఇప్పటి వరకు మొక్కలు నాటండి పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పిన వారే ఉన్నారు తప్పితే.. తాజాగా పవన్ మాదిరిగా స్వర్గం-నరకం అంటూ.. మొక్కలకు ఆపాదించిన నాయకులు లేక పోవడంతో ఆయన వ్యాఖ్యలపై ప్రజలు ఒకింత ఆసక్తిగా గమనించారు.
కానీ, భవిష్యత్తులో రాజకీయాలు పుంజుకునేలా చేస్తానని అంటున్న పవన్ ఒక్కసారిగా ఇలాంటి తత్వ వేదాంతం బోదించడాన్ని యువత పెద్దగా జీర్ణించుకోలేక పోతోంది. సమాజానికి మొక్కలు అవసరమే. అయితే, అంత మాత్రాన వాటికి స్వర్గం-నరకం వంటివాటిని ఆపాదించ డం బాగోలేదు. అనే వారు కూడా కనిపిస్తున్నారు. ఇక, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చూపిస్తానని చెప్పిన పవన్ అలా చేయడం మానేశారనే వారు కూడా ఉన్నారు.
ఇప్పుడు ఆయన వన రక్షణ ఉద్యమా న్ని భుజాలకు ఎత్తుకున్న తన ఫామ్ హౌస్‌లో మొక్కలు నాటుకుంటే ఏమొస్తుంది? ఏ రోడ్డు పక్కనో ఓ వెయ్యి మొక్కలు నాటితే.. ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. అదేసమయంలో జనాలు పడుతున్న సమస్యలపైనా ఉద్యమం చేపడితే.. బాగుంటుందని సలహా ఇస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పవన్ వన పురాణాన్ని వదిలి .. జన పురాణం చదివితే బాగుంటుందనే సూచనలు పాటిస్తారో లేదో చూడాలి.