కోవిడ్-19 పరిణామాలు- మన కర్తవ్యం

-

తెలంగాణలో లాక్ డౌన్ విధించిన తర్వాత వివిధ యంత్రాంగాలు వేర్వేరు విధులను ఏక కాలంలో నిర్వహించవలసి ఉండే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ కి అనుగుణంగా వైరస్ విస్తరణ అనేది ఆగేది కాదని ప్రభుత్వాలకు అంచనా ఉన్నప్పటికీ తగిన విధంగా సంసిద్ధత లేదు. లాక్ డౌన్ విధించడానికి మూడు ప్రధాన కారణాలు ఉంటాయి.
1. వ్యాధిని నియంత్రించడం,
2. దీర్ఘకాలంలో వ్యాధిని నియంత్రించే వీలు లేకపోతే దానికి అనుగుణంగా వైద్యపరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం మందులు వైద్య సిబ్బందిని తగినంతమందిని ఏర్పాటు చేసుకోవడం.
3. ప్రజలకు ముందు జాగ్రత్తగా తీసుకోవలసిన ఫస్ట్ ఏయిడ్ లాంటి వైద్య పద్ధతులను ప్రచారంలోకి తేవడం.
ఈ మూడింటిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం విఫలమైంది.


లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో రిస్కు గ్రూప్స్ అయినా సిబ్బంది మరియు నిత్యావసర సరుకుల విక్రేతలను పరీక్షించ వలసి ఉండే. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారు ఢిల్లీ ప్రయాణం చేసిన వారు రోగితో నేరుగా సంబంధం ఉన్న వాళ్లను మాత్రమే పరీక్షించడం జరిగింది. దాని ఫలితంగా అత్యవసర సేవల విభాగంలో పనిచేసే వైద్యులు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు కిరాణా వర్తకులు ప్రతిరోజు కూరగాయలు పండ్లు అమ్మేవారు వైరస్ బారిన పడి అది కమ్యూనిటీ వ్యాప్తి కావడానికి కారణమయ్యారు. వైద్య నిపుణులు ఈ విషయాన్ని పదేపదే చెప్తున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.

కేవలం లాక్ డౌన్ వల్ల మాత్రమే వ్యాధిని నియంత్రించడం సాధ్యం కాదు అనే విషయం మన కంటే ముందే వ్యాధి బారిన పడిన ఇతర దేశాలను చూస్తే అర్థం అయింది. ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తివేసిన విస్తృత జనాభా, రవాణా సౌకర్యాలు కలిగిన దేశంలో వలసలు, వర్తకులు, ఉద్యోగులు, దినసరి కూలీలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తారు. అలాంటి జీవన విధానం కలిగిన మన రాష్ట్రంలో వ్యాధిని నియంత్రించడం అంత సులభతరం కాదు.

మిగిలిన అన్ని డిపార్టుమెంట్లను సమన్వయం చేసి వ్యాధిని ఎదుర్కోవడానికి సన్నాహక కార్యక్రమాలు రూపొందించుకోవలసి ఉండె. ఇది సమాజానికి పరీక్ష సమయమే. ప్రజలందరికీ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవలసిన బాధ్యత ఉంది. ఎవరి స్థాయిలో వారు విపత్తు నుండి బయట పడడానికి స్వీయ క్రమశిక్షణ, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు గెలవడం ఓడిపోవడం అనే మాటతో నేనుఏకీభవించను. ఎందుకంటే ఇది పందెం కాదు. వరదలు,భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భంగా అందరం ఎలా ఐక్యంగా ఎదుర్కొంటామో అలాగే ఎదురుకోవాలి. కొత్త వ్యాధులు ప్రబలినప్పుడు ప్రభుత్వం పాత్ర చాలా ముఖ్యమైనది.

సామాజిక కోణంలో ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలు, చేసుకున్న ఏర్పాట్ల మీద ఆధారపడి పనితీరును అంచనా వేయడం జరుగుతుంది. ఏ రాష్ట్రం, దేశం తన బిడ్డలను చంపుకోవాలి అనుకోదు. కానీ ప్రతి వ్యక్తిని కాపాడేందుకు ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నం జరుగుతోందని అనే విషయం ఇక్కడ చర్చనీయం. లాక్ డౌన్ సమయంలో వ్యాధి విస్తరించే అవకాశం చాలా తక్కువగా ఉండె.

ప్రజలు గృహనిర్బంధంలో ఉన్న సమయంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికారులతో విస్తృతంగా కమిటీని ఏర్పాటు చేసి రాబోయే విపత్తులను ఎదుర్కోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోనే అవకాశం ఉన్నది. నిజానికి ప్రభుత్వం ప్రకటించినట్టు అవసరమైతే ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఉపయోగిస్తామని అనుకున్నప్పుడు,
అటువంటి ఏర్పాటు ఏమి చేసుకోలేదు. ముఖ్యంగా మెడికల్ పారామెడికల్ సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకొని ఉండాల్సింది. కోవిడ్-19 వ్యాధి మరియు చికిత్స మొదలైన తర్వాత మెజారిటీ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల పైన విశ్వాసం పెంచుకున్నారు. ఇది సమాజంలో మంచి పరిణామం. ఇప్పుడు ప్రభుత్వాల బాధ్యత కూడా పెరిగింది. సాధారణ ప్రజలు మొదలు ధనికులు వరకు అందరూ ప్రభుత్వ ఆసుపత్రి ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వాలు తలచుకుంటే ఏ రంగం అయినా తన కంట్రోల్లో పెట్టుకోగలదని ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ప్రభుత్వాలు తమ బాధ్యత నుండి పక్కకు తప్పుకోలేవు.

ప్రస్తుతం రోజువారీగా వ్యాధి బారిన పడుతున్న వారిలో సుమారు ఐదు నుంచి పది శాతం మందికి మాత్రమే అత్యవసర వైద్య సేవలు అవసరం అవుతున్నాయి. మిగిలిన వాళ్ళకి సాధారణ పద్ధతిలో వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న లెక్కల ప్రకారం సరాసరి రోజుకి 1500మంది వ్యాధికి గురైతే అందులో 75 నుంచి 100 మంది మాత్రమే అత్యవసర సేవలు అవసరం. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి రోగికి 7 నుంచి 12 రోజులు ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేసినా, ప్రతి పది రోజులకు సుమారు వెయ్యి మంది చొప్పున డిశ్చార్జ్ అయిపోతారు. సుమారుగా అంతే మంది ఆస్పత్రిలో చేరుతారు. ఈ అంచనాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవడం అవసరం. ఒకవేళ భవిష్యత్తులో వ్యాధి విస్తృతమైతే రోగులను చేర్చుకోవడానికి అవసరమైన పడకలు, వైద్య పరికరాలు పెంచుకొని చికిత్స చేయించాలి. ప్రభుత్వం ఇప్పటి నుంచే సీరియస్ కార్యాచరణకు పూనుకున్న భవిష్యత్తులో ప్రజలకు ముప్పు తప్పుతుంది.

ప్రస్తుతం చేయవలసినవి…

* పేదలకు వ్యాక్సిన్ వచ్చేలోపు రోగనిరోధక శక్తిని పెంపొందించే బి కాంప్లెక్స్ సి విటమిన్ డి విటమిన్ టాబ్లెట్స్ రేషన్ తోపాటు అందజేయాలి.
* సాధారణ లక్షణాలు ఉన్న ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ఉండడానికి ఇంటి వైద్యాన్ని ప్రచారం చేయాలి.
* ప్రస్తుతం చాలామంది పాజిటివ్ రోగులకు ఇంటి నుండే చికిత్స అందిస్తున్నప్పటికీ వారికి వైద్యుల పర్యవేక్షణ లేకపోవడం అపాయకరంగా పరిణమించే అవకాశం ఉంది.
రోడ్లపైకి వచ్చిన వాళ్లను శిక్షించి పంపడం జరిమానా వేయడం మాత్రమే కార్యాచరణ కాదు. ఆ పని చూసుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఉంది.

ఎర్రోజు శ్రీనివాస్…
సామాజిక విశ్లేషకులు

Read more RELATED
Recommended to you

Exit mobile version