నడక అనేది అత్యంత సులభమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. అయినప్పటికీ చాలామంది సరైన పద్ధతిలో నడవకపోవడం వలన మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. నిజానికి సరైన వాకింగ్ టెక్నిక్స్ ను పాటిస్తే మీ మోకాళ్లపై ఒత్తిడి తగ్గడమే కాకుండా శరీరంలోని ఇతర కీళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ మొత్తం శరీర స్థితి అద్భుతంగా మారుతుంది. మీ నడకను మరింత ప్రభావవంతంగా మార్చే ఆ 5 కీలకమైన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.
నడక అనేది ఒక సంపూర్ణ వ్యాయామం అయితే దాని పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి సరైన భంగిమ (Posture) చాలా ముఖ్యం. మొదటి టెక్నిక్ ఏంటంటే, నిటారుగా నడవడం. నడిచేటప్పుడు మీ తల పైకి, గడ్డం నేలకు సమాంతరంగా, భుజాలు వెనక్కి మరియు రిలాక్స్‌డ్‌గా ఉంచండి. ఇది వెన్నెముకను నిటారుగా ఉంచి, మోకాళ్లపై భారాన్ని తగ్గిస్తుంది.

రెండవది మీ చేతుల కదలిక. చేతులను 90 డిగ్రీల కోణంలో వంచి, ముందుకు వెనక్కి లయబద్ధంగా ఊపడం వలన శరీరానికి బ్యాలెన్స్ లభిస్తుంది మరియు నడుము కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. మూడవ ముఖ్యమైన టెక్నిక్ అడుగు పెట్టే పద్ధతి. నడిచేటప్పుడు ముందుగా మడమ నేలకు తాకి, ఆ తర్వాత మొత్తం పాదం చివరకు కాలివేళ్లు నేలపై తాకాలి. ఇది షాక్ అబ్జార్బర్ లా పనిచేసి, మోకాలికి, వెన్నెముకకు షాక్ తగలకుండా రక్షిస్తుంది.
నాల్గవది అడుగుల పొడవు. చాలా పెద్ద అడుగులు వేయడం లేదా మరీ చిన్న అడుగులు వేయడం సరికాదు. మీ శరీరానికి సౌకర్యంగా ఉండే మధ్యస్థ పొడవు అడుగులు వేయడం వలన మోకాళ్లపై అధిక ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఐదవది బొడ్డు కండరాలను కొద్దిగా లోపలికి పట్టి ఉంచడం. ఇది మీ శరీర స్థిరత్వాన్ని పెంచుతుంది నడుము కండరాలను బలోపేతం చేస్తుంది మరియు నడక భంగిమను మెరుగుపరుస్తుంది. ఈ 5 టెక్నిక్స్ పాటిస్తే మోకాళ్ల నొప్పిని తగ్గించుకోవచ్చు నడకను మరింత ప్రభావవంతమైన వ్యాయామంగా మార్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
గమనిక: మీకు ఇప్పటికే తీవ్రమైన మోకాలి నొప్పి లేదా కీళ్ల సమస్యలు ఉన్నట్లయితే నడకను ప్రారంభించే ముందు లేదా కొత్త టెక్నిక్స్ ప్రయత్నించే ముందు ఫిజియోథెరపిస్ట్ లేదా వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.
