స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం కోసం పోరాటం చేసిన వీరులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. మార్చి 23.. షాహీద్ దివస్.. స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, శివరాం రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌లను బ్రిటిష్ అధికారులు ఉరి తీసిన రోజు.. అందుకే ఆ రోజును షాహీద్ దివస్‌గా జరుపుకుంటున్నాం. ఆ రోజును భారతజాతి ఎన్నటికీ మరువలేదు. నేటి తరం యువతకు ఆ ముగ్గురి జీవితాలు ఎంతో ప్రేరణనిస్తాయి. అయితే వారిని ఉరి తీయకముందు భగత్ సింగ్ చాలా భావోద్వేగంతో సుఖ్‌దేవ్‌కు ఒక ఉత్తరం రాశారు. అది ఇప్పటికీ మనకు అందుబాటులో ఉంది. దాని సారాంశమిదే…
”నువ్వు రాసిన ఉత్తరాన్ని నేను చాలా సార్లు చదివా. ప్రస్తుతం పరిస్థితులు మారడం వల్ల మనపై ఆ ప్రభావం పడింది. బయట మనం ఏవిధంగా ఉన్నామో అందుకు పూర్తిగా జైలులో ప్రవర్తిస్తున్నాం. బయట ఉన్నప్పుడు మనం ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం. కానీ ఆత్మహత్య అనేది ఒక పిరికి చర్య అని నువ్వు అన్నావు. దానిపై మనం శషన్‌షాహీ కుటియాలో మాట్లాడుకున్నాం. మనం ఒక్కరం బాధపడుతూ త్యాగం చేస్తేనే అది దేశానికి సేవ చేసినట్లు అవుతుంది. నౌజవాన్ భారత్ సభలో మన నినాదం కూడా ఇదే కదా.
మనిషి తాను తీసుకున్న నిర్ణయం సరైంది అనుకున్నప్పుడే ఏదైనా పని చేస్తాడు. అసెంబ్లీపై మనం బాంబులు వేసినప్పుడు మనం కూడా అలాగే అనుకున్నాం. దాని వల్ల వచ్చే సంభవించే ఎలాంటి పరిణామాలనైనా సరే అనుభవించేందుకు మనం ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. మనపై జాలి చూపించాలని మనం వారిని కాళ్లా వేళ్లా పడి బతిమాలి ఉంటే బాగుండేదని అనుకుంటున్నావా..? కాదు.. అది సరికాదు.. అలా చేస్తే తీవ్రమైన దుష్పరిమాణాలు ఏర్పడుతాయి. కానీ మనం ఇప్పుడు విజయ పథంలోనే పయనిస్తున్నాం.
మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మనం మన ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉండాలి. ఆత్మ త్యాగానికి సిద్ధపడాలి. అలాంటప్పుడు అది ఆత్మహత్య ఎలా అవుతుంది..? దేశం కోసం ప్రాణాలర్పించడం ఆత్మహత్య కాదు. మనం, మనతోపాటు ఎంతో మంది త్వరలో ఉరితీయబడతారు. అందుకు అందరమూ సిద్దంగా ఉండాలి. కానీ పిరికివాళ్లలా ముందే ఆత్మహత్య చేసుకోకూడదు. మనల్ని జైలులో అనేక రకాలుగా చిత్ర హింసలకు గురి చేశారు. అయినప్పటికీ మనం చేయాలనుకున్న పనులను, మన ప్రయత్నాలను మనం ఆపలేదు. ఇక ముందు కూడా మనం అలాగే కొనసాగాలి.
మనం దేవున్ని నమ్మం.. స్వర్గ, నరకాలను నమ్మం.. మన నమ్మేది ఒక్కరినే.. మనుషులను.. అందుకని మనం ఇప్పుడు చావో బతుకో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఢిల్లీ నుంచి నన్ను ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు కొందరు అధికారులు నన్ను ప్రశ్నించారు. నా నుంచి వివరాలను రాబట్టేందుకు యత్నించారు. అయితే వారికి నేనొక్కటే చెప్పా.. నేను అనవసరంగా చావనని.. నా చావు వల్ల నా చుట్టూ ఉన్న అందరికీ వీలైనంత వరకు ప్రయోజనం కలిగితేనే.. నేను చస్తా.. నా అంతిమ ఘడియల వరకు నేను ఇంకొకరికి మానవత్వంతో సహాయం చేస్తా. కనుక ఎవరూ అధైర్య పడవద్దు.
నేను చేసిన పనుల వల్ల నాకు కచ్చితంగా కఠినమైన శిక్ష పడుతుందని నాకు తెలుసు. అయినా నాపై జాలి, దయ చూపించమని ఎవర్నీ అడగను. సమయం వస్తే మనందరినీ ఉరి తీస్తారు. ఆ విషయం నాకు తెలుసు. అయితే దేశ భవిష్యత్తు బాగుంటుందంటే.. కొందరు తమ ప్రాణాలను త్యాగం చేయక తప్పదు. బ్రిటిష్ వారిలో మార్పు వస్తుందని మనమైతే అనుకోవడం లేదు. అయితే ఆ మార్పు రావాలంటే కొందరు త్యాగాలు చేయకతప్పదు. దాంతో మనం అనుకున్నది కూడా సాధించవచ్చు. మనల్ని ఉరి తీయడం వల్ల దేశ ప్రజల గుండెల్లో మనం చెరగని ముద్ర వేస్తామని అనుకుంటున్నాం. మనకింతకన్నా కావల్సింది ఇంకా ఏమీ లేదు..! ”