భారతీయ జనతా పార్టీపై ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు భగవత్ మన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాషాయ కండువా కప్పుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడంతోపాటు కేంద్ర మంత్రి పదవి కూడా ఇప్పిస్తానని బీజేపీ సీనియర్ నేత ఆఫర్ చేశారని ఆరోపించారు. తనను ఎవరూ కొనుగోలు చేయలేరని పునరుద్ఘాటించారు. భగవత్ మన్ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఆఫర్ చేసిన నేత పేరు బహిరంగపర్చాలని ఆ పార్టీ సవాల్ విసిరింది.
‘నాలుగు రోజుల క్రితం బీజేపీ నేత నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీరు బీజేపీలో చేరాంటే మీకు ఏమి కావాలి? డబ్బులు కావాలా?’ అని ఆఫర్ చేశారని భగవత్ మన్ తెలిపారు. మీరు ఏకైక ఆప్ ఎంపీ. మీపైన ఫిరాయింపుల చట్టం వర్తించదు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ మినిస్టర్ కావచ్చు. చెప్పండి మీకు ఏ శాఖ కావాలని ఆ నేత అడిగారని మన్ పేర్కొన్నారు. గోవా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలను ఉటంకిస్తూ ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడంపై బీజేపీ రాజకీయాలు ఆధారపడ్డాయని ఆరోపించారు.