మరో తిరుమలగా జమ్మూ కాశ్మీర్.. శ్రీవారి ఆల‌యానికి భూమిపూజ‌

-

మరో తిరుమలగా జమ్మూ కాశ్మీర్ మారనుంది. జమ్మూలో శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి టీటీడీ నడుంబిగించింది. ఇందులో భాగంగా ఈ రోజు భూమి పూజా కార్యక్రమం నిర్వహించింది టీటీడీ. మొత్తం 62 ఎకరాల 10 సెంట్లలో 33 కోట్ల 22 లక్షల రూపాయలతో రెండు విడతలుగా దేవాలయ నిర్మాణం చేయనున్నారు. మొత్తం భూమిని ఏడాదికి ఒక “కనాల్”కు 10 రూపాయల అద్దె చొప్పున 40 ఏళ్లపాటు టిటిడికి లీజ్ ఇచ్చింది జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం. అద్దె కింద మొత్తం ఒక లక్ష 98 వేల రూపాయలను ముందుగానే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి చెల్లించి భూమిని అధీనంలోకి తీసుకుంది టిటిడి. జమ్మూ జిల్లాలోని మజీన్ గ్రామంలో దేవాలయానికి భూమిని కేటాయించింది జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం. శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రధాన దేవాలయంతో పాటు, శ్రీ ఆండాల్, శ్రీ పద్మావతి అమ్మవార్ల ఉప దేవాలయాల నిర్మాణం చేపట్టనున్నారు. గర్భాలయం, ఆరాధన మండపం దక్షిణ భారత దేశానికి చెందిన గ్రానైట్ తో నిర్మాణం చేపట్టనున్నారు.

దేవాలయం ప్రహారి గోడ, ప్రవేశ ద్వారంతో కూడిన మూడు అంతస్తుల రాజగోపురాన్ని పూర్తిగా రాతితో నిర్మాణం చేయనున్నారు. రాజగోపురంపై కప్పు వరకు రాతితో నిర్మాణం… పైకప్పు నుంచి మిగిలిన గోపుర నిర్మాణం మాత్రం సిమెంటుతో కట్టేందుకు నిర్ణయం తీసుకుంది టీటీడీ. తొలి విడతలో 27 కోట్ల 72 లక్షలతో వాహన మండపం, అర్చకులు, ఇతర పాలనా సిబ్బందికి వసతి గృహాలు, తీర్థయాత్రికులకు వేచి ఉండే హాల్, ఇతర మౌలిక వసతులైన రహదారులు, డ్రైనేజీ పనులు, నీటి సరఫరా, విద్యుద్దీకరణ లాంటి పనులను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెండవ విడతలో మొత్తం 5 కోట్ల 50 లక్షల రూపాయలతో వేద పాఠశాల, కల్యాణ మండపం నిర్మాణం చేయాలని సంకల్పించారు. దేవాలయ నిర్మాణం మొత్తం 18 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news