సీబీఎస్‌ఈ క్లాస్ 10, 12 బోర్డు ఎగ్జామ్‌లను 2021లో రాయనున్న విద్యార్థులకు పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది బోర్డు వెల్లడించింది. సీబీఎస్‌ఈ ఎగ్జామ్ ప్లానర్ సనయం భరద్వాజ్ ఈ మేరకు ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. సీబీఎస్‌ఈ బోర్డు ఎగ్జామ్ 2021 పరీక్షలను ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ బోర్డు పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అయితే పరీక్షల నిర్వహణపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, తల్లిదండ్రులు, విద్యార్థులు, నిపుణులతో చర్చించి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారన్నారు. కానీ పరీక్షలను వాయిదా వేసే ఆలోచన లేదని, కరోనా ఉన్నప్పటికీ గతంలో నిర్వహించిన మాదిరిగానే పరీక్షలను అన్ని జాగ్రత్తలతో నిర్వహిస్తామని తెలిపారు.
ఇక సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని వస్తున్న వార్తలను నమ్మకూడదన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో వచ్చే వార్తలను నమ్మకూడదన్నారు. కచ్చితంగా పరీక్షను రాత పద్ధతిలోనే నిర్వహిస్తామని తెలిపారు. కాగా విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే స్పష్టతనిచ్చారని, సర్వే చేశాకనే పరీక్షల తేదీలను ప్రకటిస్తామని అన్నారు. అలాగే డిసెంబర్ 10న మంత్రి స్వయంగా లైవ్ ద్వారా విద్యార్థుల సందేహాలకు సమాధానాలిస్తారని తెలిపారు.