తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత అత్యాచారం హత్య కేసులో ప్రత్యేక కోర్ట్ నిందితులకు ఉరి శిక్ష విధించింది. బతుకు దెరువు కోసం గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు, జడ రబ్బర్లు అమ్ముకునే సమతను అపహరించి నవంబర్ 24 , 2019న తేదిన కొమురంభీం జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలోని లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో అత్యాచారం చేసి హత్య చేసారు ముగ్గురు.
షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్‌లు ఆమెను అపహరించి అత్యాచారం చేసి గొంతు కోసి, చేతి వేళ్ళు కత్తిరించి హత్య చేసారు. కేసుని సీరియస్ గా తీసుకున్న తెలంగాణా పోలీసులు పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. డిసెంబర్ 14న ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నవంబరు 25న ఆమె మృతదేహం కనుక్కొన్నారు. ఈ కేసులో ఈ నెల 20న వాదనలు పూర్తి అయ్యాయి.
27 న తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా ఈ రోజుకి తీర్పుని వాయిదా వేసారు. ఈ నేపధ్యంలోనే నిందితులు ముగ్గురుని పోలీసులు కోర్ట్ కి తీసుకొచ్చారు. దీనితో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయవాది వారికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. దీనిపై సమతా భర్త గోపీ హర్షం వ్యక్తం చేసారు. నిందితులను ఉరి తీస్తే తన భార్య ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈ కేసు విషయంలో తెలంగాణా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. దళిత మహిళ కాబట్టే దిశా అత్యాచారం తరహాలో స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. దిశా అత్యాచారాన్నే అత్యాచారంగా తీసుకున్నారని తన భార్య మీద అంతకు మించిన దారుణం జరిగిందని ఆమె భర్త కూడా ఆవేదన వ్యక్తం చేసారు. నిందితులను తక్షణమే శిక్షించాలి అని డిమాండ్లు వినిపించాయి.
నిందితులను కోర్ట్ హాల్ లోకి న్యాయమూర్తి పిలిచి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేరం రుజువు అయిందని చెప్పగా నిందితులు కన్నీరు పెట్టుకున్నారు. తామే కుటుంబానికి ఆధారం అని వేడుకున్నారు. తమను క్షమించాలి అని జడ్జిని వేడుకున్నారు నిందితులు. కోర్ట్ తీర్పుపై బాధితురాలి తరుపు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు.