రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రబుత్వం సర్వం సిద్ధం చేసుకుంది. అన్ని వైపుల నుంచి అన్ని పరిస్థితులను కూలంకషం గా అధ్యయనం చేసిన ప్రభుత్వం.. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలనే నిర్ణయాన్ని కూడా వెలువరించింది. నాయకులను పిలిచి.. ఇప్ప టికే దీనిపై చర్చించిన జగన్.. వారిని హెచ్చరించారు కూడా. తేడా వస్తే పదవులు ఉండవని కూడా తెగేసి చెప్పేశారు. దీంతో వైసీపీ నుంచి పోరు ఏ రేంజ్‌లో ఉండబోతోందో.. ఇప్పటికే కళ్లకు కట్టింది. అయితే, మరి ఇలాంటి పరిస్థితి ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఉందా? ఉంటుందా? ఎలా పుంజుకుంటుంది. స్థానికంగా ఎలా ముందుకు వెళ్తుంది? అనే చర్చ ఆ పార్టీలోనే కాకుండా టీడీపీని ఫాలో అవుతున్న రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది.
స్వార్వత్రిక సమయంలో టీడీపీ ఘోరంగా విఫలమైన తర్వాత వస్తున్న మరో ప్రధాన ఎన్నికలు స్థానిక సమరమే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత.. నుంచి చంద్రబాబు అండ్‌పార్టీ అనేక రూపాల్లో జగన్ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అనేక రూపాల్లో ఆందోళనలు, నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. తుగ్లక్ పాలన అంటూ భారీ ఎత్తున విమర్శలు చేశారు. దీంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా ముందుకు సాగుతారు? అనే ప్రశ్న సహజంగానే ఉంటుంది.
ఇప్పటికే ఆయన చేపట్టిన ప్రజాచైతన్య యాత్రలోనూ ఈ వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. గత ఏడాది చేసిన తప్పును మరోసారి చేయొద్దని ప్రజలకు చెబుతున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చారని ఇప్పుడు బాధలు పడుతున్నారని, స్థానికంగా తమకే ఛాన్స్ ఇవ్వాలని కూడా ఆయన కోరుతున్నారు.
ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు సీరియస్‌గానే తీసుకున్నారనే విషయం ఇట్టే అర్ధమవుతుంది. అయితే, వైసీపీ తరహాలో టీడీపీలో నేతలను ఒకే గాటపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చంద్రబాబు చేయగలరా? పార్టీ ఓడితే.. చర్యలు తీసుకుంటాననే ధైర్యం ఆయనలో ఉందా? ఇప్పుడున్న పరిస్థితిలో నాయకులను ఆయన హెచ్చరించగలరా? అనేది మాత్రం ప్రశ్నార్థకంగా నే ఉంది.
ఎక్కడికక్కడ నానా రీతిగా ఉన్న నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం అనేది చంద్రబాబుకు తలకుమించిన పని. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచితే.. కేసులు పెడతామని చెబుతున్న ప్రభుత్వ తీరుతో తమ్ముళ్లు హడలి పోతున్నారు. ఇప్పుడు వారిలో ఈ భయం పోవాలన్నా.. ఉత్సాహంగా పనిచేయాలన్నా.. చంద్రబాబు వ్యూహమే మంత్రంగా పనిచేయాలి. కానీ, ఆ దిశగా బాబు చేసే ప్రయత్నాలేంటి? అనేది మాత్రం వేచి చూడాలి. ఏదేమైనా.. వైసీపీతో పోల్చుకుంటే.. ప్రధాన ప్రతిపక్షం రేటింగ్ చాలా తక్కువగానే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.