శానిటరీ నాప్కిన్స్పై ఓ విద్యార్థిని ప్రశ్నకు ‘కండోమ్‌లు కూడా ఉచితంగా ఇవ్వాలా?’ అంటూ వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిణి హర్‍జోత్ కౌర్ చిక్కుల్లో పడ్డారు. ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రంగంలోకి దిగారు. హర్‍జోత్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఐఏఎస్ అధికారిణి హర్‌జోత్ కౌర్‌పై చర్యలు తీసుకుంటామని సూత్రప్రాయంగా తెలిపారు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్. ఆమె వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనే కారణంతో సీఎం సీరియస్‌గా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 27న జరిగిన కార్యక్రమంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారిణిని వివరణ ఇవ్వాలని ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది.
తన వ్యాఖ్యలు పట్ల వివాదం చెలరేగడం వల్ల మహిళా ఐఏఎస్ అధికారిణి హర్‍జోత్ కౌర్ బుమ్రా విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ‘నేను ఎవరినీ కించపరచాలని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అలా వ్యాఖ్యానించలేదు. నా వ్యాఖ్యలపై పశ్చాత్తాపడుతున్నా’ అని ఆమె అన్నారు.