కరోనా మహమ్మారికి గాను దేశీయ డ్రగ్ తయారీదారు భారత్ బయోటెక్ కోవాక్సిన్ అనబడే వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ప్రిలిమినరీ ఫలితాలు ఆశాజనకంగా రావడంతో ఆ కంపెనీ ఫేజ్ 1, 2 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందింది. దీంతో ఈ నెలలో ఆ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ఇక అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ ఫార్మా సంస్థలు కలిసి రూపొందించిన మరో కరోనా వ్యాక్సిన్ మొదటి దశ హ్యూమన్ ట్రయల్స్‌లో సత్ఫలితాలను ఇచ్చింది.
బీఎన్‌టీ162బి1 పేరిట ఆ రెండు కంపెనీలు కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను రెండు గ్రూపులుగా విభజించబడిన 24 మంది ఆరోగ్యవంతమైన వాలంటీర్లకు రెండు డోసుల్లో ఇచ్చారు. మొదటి గ్రూపుకు రెండు డోసుల వ్యాక్సిన్‌ను రెండు దశల్లో 3 వారాలకు ఒకసారి ఇవ్వగా, రెండో గ్రూప్‌కు ఒకేసారి అధిక పరిమాణంలో డోస్‌ను కేవలం ఒక్కసారి మాత్రమే ఇచ్చారు. ఇక వీరిలో నలుగురికి 3 వారాల అనంతరం స్వల్పంగా జ్వరం మాత్రమే వచ్చిందని, ఇతర ఏ అనారోగ్య సమస్యలు రాలేదని గుర్తించారు. అలాగే డోసుల పరిశీలన కాలపరిమితి ముగిశాక ఆ వాలంటీర్లలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారైందని, కోవిడ్‌ను ఎదుర్కొనగల యాంటీ బాడీలు వారి శరీరాల్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అయ్యాయని తేల్చారు. ఇక ఆ రెండు ఫార్మా కంపెనీలు తరువాతి దశ హ్యూమన్ ట్రయల్స్ కోసం సిద్ధమవుతున్నాయి.
ఫైజర్, బయోఎన్‌టెక్ కంపెనీలు తమ బీఎన్‌టీ162బి1 కోవిడ్ వ్యాక్సిన్‌ను రెండో దశలో పరీక్షించడానికి గాను మొత్తం 30వేల మంది వాలంటీర్ల సహాయం తీసుకోనున్నాయి. జూలై చివరి వారంలో ఈ ట్రయల్స్ ప్రారంభమై ఫలితాలు ఆగస్టు చివరి వరకు వచ్చే అవకాశం ఉంది. తరువాత ఈ ఏడాది చివరి వరకు వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మొదటి దశలో 100 మిలియన్ల డోసులను సిద్ధం చేయనున్నారు. 2021 చివరి వరకు 1.2 బిలియన్ల డోసులను ఉత్పత్తి చేయనున్నారు.