మొన్నటి వరకు బలంగా ఉన్న ఎన్డియే నిన్నటి నుంచి బలహీనపడటం మొదలయింది. రాజకీయంగా తనకు ఉన్న బలాన్ని బిజెపి… మిత్ర పక్షాలను ఇబ్బంది పెట్టడానికి వాడుకోవడంతో… ఎన్డియే నుంచి ఒక్కో పార్టీ బయటకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఈ నేపధ్యంలోనే అధికారం కోసం శివసేనను బిజెపి ఇబ్బంది పెట్టడం, సిద్దాంతాలు వేరు అయినా సరే కాంగ్రెస్ తో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డియేలో బిజెపి తర్వాత ఆ స్థాయిలో బలంగా ఉండే పార్టీ అదే.
దీనితో శివసేన కాళీని, ఇతర పక్షాల లోటు ని భర్తీ చేసుకునే ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఎన్డియేలో చేరమని జగన్ ను బిజెపి ఆహ్వానించినా, ప్రత్యేక హోదా ఇస్తేనే వస్తాను అని జగన్ చెప్పారట. ఇది పక్కన పెడితే… ఇప్పుడు కేసిఆర్ కి ఎన్డియే లో చేరే ఆహ్వానం అందించినట్టు సమాచారం. ఎన్డియేలోకి వస్తే కీలక పదవి ఇస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది మే తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటామని చెప్పారట.
దీనిపై కెసిఆర్ పెదవి విరిచినట్టు తెలుస్తుంది. తెలంగాణాలో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని, అలాగే తనకు మజ్లీస్ మిత్రపక్షంగా ఉందని, తాను ఎన్డిఎలో చేరితే తనకు బలంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు దూరమయ్యే అవకాశం ఉందనే వ్యాఖ్యలు కేసిఆర్ చేసారట. అలాగే ఎన్డిఎలో చేరడం వలన తనకు చేకూరే లబ్ది కూడా రాష్ట్రంలో ఏమీ లేదని అప్పుడు కాంగ్రెస్ కి అవకాశాలు పెరుగుతాయని కూడా చెప్పినట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే బిజెపి అగ్ర నేతలకు కెసిఆర్ సంకేతం కూడా పంపినట్టు సమాచారం.