బీజేపీ నాయకురాలి దారుణ హత్య.. అనుమానంతో కాల్చిచంపిన భర్త

-

హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్న భర్తే ఓ మహిళను కిరాతకంగా కాల్చిచంపాడు. తన ఇద్దరు పిల్లలు, తండ్రి ముందే హంతకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం అపార్టుమెంటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా రివాల్వర్‌తో బెదిరించి పారిపోయాడు. సెక్టార్‌ 93 హౌసింగ్‌ సొసైటీలోని ఓ అపార్టుమెంటు 8వ అంతస్తులో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మునేష్‌ గొడారా అనే మహిళ హర్యానాలో ‘బీజేపీ కిసాన్‌ మోర్చా’ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలు, మామతో కలిసి సెక్టార్‌ 93 ఏరియాలోని ఓ అపార్టుమెంటులో రెంటుకు ఉంటున్నారు. ఆమె భర్త సునీల్‌ గొడారా ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే సునీల్‌ గొడారా భార్యకు వివాహేతర సంబంధం ఉందని తరచూ అనుమానించేవాడు. ఈ విషయమై ఇద్దరూ ఎప్పుడూ గొడవపడుతుండేవారు.

ఆదివారం రాత్రి కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సునీల్‌ గొడారా బయటికి వెళ్లి మద్యం సేవించి తిరిగొచ్చాడు. అతను వచ్చేసరికి భార్య కిచెన్‌లో ఫోన్‌ మాట్లాడుతుండటం చూసి, తన ప్రియుడికే ఫోన్‌ చేసిందని అనుమానించాడు. వెంటనే తన జేబులోని సర్వీస్‌ రివాల్వర్‌ తీసి ఛాతిలో, పొట్టలో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దాంతో మునేష్‌ గొడారా అక్కడికక్కడే కుప్పకూలింది.

అయితే మునేష్‌ గొడారా కుటుంబసభ్యులు మాత్రం ఆమె అలాంటిది కాదని చెప్పారు. తన సోదరి 20 ఏండ్ల వివాహ జీవితంలో ఎప్పుడూ గొడవలే ఉన్నాయని మునేష్‌ సోదరుడు ఎస్‌కే జకార్‌ విలపించాడు. సునీల్‌ ప్రతి క్షణం తన సోదరిని అనుమానించేవాడని, ఆఖరికి హత్య జరిగిన సమయంలో కూడా ఆమె మాట్లాడింది ఎవరితోనో కాదని, తన మరో సోదరితోనేనని జకార్‌ చెప్పాడు. సునీల్‌ కాసేపు ఓపికపట్టి ఉంటే ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారో తెలిసేదని, ఇంత దారుణం జరిగేది కాదని అతను వాపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news