పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నవేళ కరోనా మహమ్మారి బారినపడుతున్న ఎంపీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నిన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కరోనా వైరస్ సోకింది. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వినయ్ సహస్రబుద్దీకి గురువారం రాత్రి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. నిజానికి.. ఎంపీ వినయ్ గత శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. దీంతో అతను పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరయ్యారు.
అయితే నిన్న తలనొప్పి, స్వల్ప జ్వరం రావడంతో గురువారం రాత్రి తాను కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, అందులో పాజిటివ్ అని వచ్చిందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ హోంక్వారంటైన్ లో ఉన్నానని వెల్లడించారు. కాగా, పార్లమెంటు సమావేశాల సందర్భంగా మొదటిరోజు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో బీజేపీ నేతలు మీనాక్షి లేఖి, అనంత్ కుమార్ హెగ్డె, పర్వేష్ సింగ్ వర్మ సహా 17 మంది ఎంపీలకు పాజిటివ్ వచ్చింది. ఈ నెల 14న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు అక్టోబర్ 1వతేదీ వరకు జరగనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నేతల్లో భయాందోళన కనిపిస్తోంది.