గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీకి దుబ్బాక ఉప ఎన్నిక పెద్ద సవాల్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికల విజయం గాలివాటం కాదని ఫ్రూవ్ చేసుకునేందుకు దుబ్బాకలో బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. టీఆర్ఎస్ కంచుకోటలో గెలిచేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 80 సీట్లకు పైగా విజయంతో కేసీఆర్ వరుసగా రెండోసారి తిరుగులేకుండా అధికారంలోకి వచ్చారు. అయితే తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉండేది. ఇప్పుడు టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వీలుంటే అధికారంలోకి రావడం లేదా రెండో స్థానమే టార్గెట్‌గా బీజేపీ తెలంగాణలో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే దుబ్బాకలో గెలుపు కోసం బీజేపీ సరికొత్త అస్త్రంతో టీఆర్ఎస్‌ను ఇరుకున పెడుతోంది. రాష్ట్రంలో హిందువులు, వారి పండుగల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని… హిందువులను కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని బీజేపీ నేతలు గట్టిగా ప్రచారం చేస్తున్నారు.
ఇక టీఆర్ఎస్ సానుభూతిని నమ్ముకుంటున్నా ఇదే జిల్లాలోని నారాయణ ఖేడ్‌లో గతంలో సానుభూతి పనిచేయని విషయాన్ని బీజేపీ పెద్దలు గుర్తు చేస్తున్నారు. పైగా దుబ్బాక ప్రజల్లో ఇటీవల చైతన్యం వచ్చింది. ఈ నియోజకవర్గం చుట్టూ ఉన్న సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్లలో జరిగిన అభివృద్దితో పోలిస్తే దుబ్బాకను పట్టించుకున్న వారే లేరు. గతంలో కరీంనగర్ లాంటి టీఆర్ఎస్ కంచుకోటలో బండి సంజయ్ ఎంపీగా గెలవడం వెనక కేసీఆర్ చేసిన హిందుగాళ్లు బొందుగాళ్లు డైలాగ్ బాగా పని చేసింది.
ఆ ఎన్నికల్లో హిందువులు కేసీఆర్‌పై కోపంతో టీఆర్ఎస్‌ను ఓడించారు. ఇప్పుడు బీజేపీ సైతం ఇదే పంథాలో కేసీఆర్ ప్రభుత్వం హిందువులను అణిచివేస్తోందని చేస్తోన్న ప్రచారం మరోసారి కలిసి వస్తుందని.. అదే ఇక్కడ కారు పార్టీని ఓడిస్తుందని నమ్ముతోంది. కేసీఆర్ గతంలో హిందువులపై చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు బీజేపీ అస్త్రాలుగా వాడుకుంటోంది. దీంతో పాటు ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు పరిహారంగా పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గ రైతులకు 30 లక్షల నుంచి 50 లక్షలు ఇచ్చారనీ..దుబ్బాకలో మాత్రం 15 లక్షలు మాత్రమే ఇచ్చిన విషయం కూడా టీఆర్ఎస్‌కు మైనస్‌గా మారనుంది. ఈ పరిణామాలు అన్ని బీజేపీకి కలిసి వస్తోన్న మాట నిజం. మరి తుది ఫలితంలో వీటి ప్రభావం ఎలా ఉంటుందో ? చూడాలి.