తిరుపతిలో 1999 ఫార్ములా బీజేపీకి కలిసొస్తుందా

-

తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కొసం శతవిధాల ప్రయత్నిస్తుంది బీజేపీ. ప్రధాన రాజకీయపార్టీలు ఇక్కడ హోరాహోరి తలపడుతున్నాయి. పలు సమీకరణలు లెక్కలేసిన బీజేపీ మాజీ ఐఏఎస్ ను రంగంలో దించింది. ఇక్కడ ఐఏఎఎస్ అన్న హోదా కంటే కుల సమీకరణకే అధిక ప్రాధన్యత ఇచ్చింది. ఎందుకంటే 1999లో బీజేపీ ఈ వ్యూహంతోనే ఇక్కడ సక్సెస్ అయిందట. మళ్లీ ఆ పాత ఫార్ముల పైనే ఎక్కువ నమ్మకం ఉంచింది కమలదళం.


కర్నాటక మాజీ సీఎస్‌ రత్నప్రభ పేరును చివరి నిమిషంలో బీజేపీ ఖరారు చేసింది. ఈ సందర్భంగా ఆమెను తిరుపతి తీసుకురావడం.. బీజేపీ వేసుకున్న లెక్కలు రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తోంది. తిరుపతి లోక్‌సభ స్థానం ఎస్సీ నియోజకవర్గం. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, కాంగ్రెస్‌ క్యాండిడేట్‌ చింతా మోహన్‌ ముగ్గురూ ఎస్సీలలో మాల సామాజికవర్గానికి చెందినవారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ మాత్రం ఎస్సీలలో మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఈ విషయాన్నే బీజేపీ ప్రధానంగా పరిగణనలోకి తీసుకుందట.

వైసీపీ,టీడీపీ,కాంగ్రెస్ మధ్య మాల సామాజిక వర్గం ఓట్లు చీలిపోయినా.. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఓట్లు తమకు గంపగుత్తగా పడతాయని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. ఈ ఓట్లకు తోడు ఇతర సామాజికవర్గ ఓట్లు కలిసి వస్తాయని లెక్క లేసుకుంటున్నారు. ఎస్సీ వర్గీకరణకు సైతం బీజేపీ అనుకూలంగా ఉందని చెప్పడం తమకు అనుకూలతగా లెక్కలేస్తున్నారు బీజేపీ నేతలు. అయితే మొదటి నుంచి మాల సామాజికవర్గానిదే తిరుపతి లోక్‌సభ పరిధిలో ఆధిపత్యం. ఇక్కడ నుంచి చింతా మోహన్‌ ఆరుసార్లు ఎంపీ అయ్యారు.

తిరుపతి లోక్‌సభ పరిధిలో దాదాపు 17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మాల సామాజికవర్గం ఓటర్లే ఎక్కువ. మాల, మాదిగ సామాజికవర్గాల మధ్య ఏడు నుంచి పదిశాతం ఓట్ల తేడా ఉంటుందని ఒక అంచనా. 1999లో మాత్రం టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ వెంకటస్వామి మాత్రం మాదిగ సామాజికవర్గం నేత. ఆయన ఎంపీ అయ్యారు. నాడు ఆ ఫార్ములా సక్సెస్‌ కావడంతో అదే ప్రయోగం మళ్లీ రత్నప్రభ ద్వారా చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version