తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందా ?

-

అయోధ్య రామమందిరం అంశంతో దేశంలో బలమైన పునాదులు వేసుకున్న బీజేపీ.. ఏపీ, తెలంగాణలో కూడా పుంజుకునేందుకు ఆలయాలనే నమ్ముకుంటున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు బీజేపీ గుడులు, గోపురాలు అంటే మతం.. మతంరంగు అనుకున్న ప్రజలు కూడా ఇప్పుడు పెద్దగా చర్చించడం లేదు. పార్టీలకు తప్ప ప్రజలకు టాపిక్‌ కాకుండా పోయింది. కాకపోతే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఆలయాల సెంటిమెంట్‌ వర్కవుట్‌ కావడంతో.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు కమలనాథులు. ..ఏపీ, తెలంగాణల్లో బీజేపీ చీఫ్‌లు ఇదే అజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారా అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.

తెలుగు రాష్ట్రాలో ఇప్పుడు టెంపుల్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి పొలిటికల్‌ మైలేజీకి ఇదే కీలక అస్త్రంగా కమలనాథులు భావిస్తున్నారు.ఈ వ్యూహాన్ని కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా ఇటు ఏపీలోనూ ఈ అంశంపైనే మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు స్కెచ్‌ వేస్తున్నారు బీజేపీ నేతలు. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే.. ఏపీ బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు వచ్చిన తర్వాత రెండు అంశాలపై దూకుడుగా వెళ్లారు. ఆ సమయంలో ఇతర హిందూ సంస్థలు కూడా తోడు రావడంతో బీజేపీకి టైమ్‌ మొదలైందని భావించారు. తర్వాత ఏమైందో ఏమో ఆ ఊపు తగ్గింది. అంతర్వేదిలో రథం కాలిన ఘటనపై హిందూ సంఘాల ఉద్యమానికి మద్దతు తెలియజేసిన బీజేపీ.. అమలాపురం ముట్టడికి కూడా పిలుపు ఇచ్చింది. వరుస ఆందోళనలతో రాజకీయాల్లో వేడి రగిలించింది. తర్వాత వెలుగులోకి వచ్చిన దుర్గమ్మ వెండిరథంపై సింహపు ప్రతిమల చోరీపైనా బీజేపీ ఉద్యమించింది. ఈ రెండు ఘటనలపై సోము వీర్రాజు ప్రభుత్వంపైనా.. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసులపైనా పదునైన విమర్శలు చేశారు.

కొన్నాళ్ల తర్వాత ఆ రెండు ఉద్యమాలు చల్లారిపోవడంతో బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ గప్‌చుప్‌ అయ్యాయి. ఇంతలో తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక రావడం.. అందులో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ చేసిన విమర్శలు కేడర్‌ను ఉత్సాహ పరిచాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి సవాళ్లు విసిరారు. టీఆర్‌ఎస్‌కు డెడ్‌లైన్‌ పెట్టారు. ఈ లైన్‌ పార్టీకి వర్కవుట్‌ అవుతోందని భావించిన కమలనాథులు.. కేంద్ర హోంమంత్రిని గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి పిలిచి నేరుగా భాగ్యలక్ష్మి ఆలయానికి తీసుకెళ్లారు. తమ సహజ సిద్ధమైన హిందూ కార్డును బయటకు తీశారు బీజేపీ నేతలు.

ఇక గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌కు ముందురోజు సైతం హైదరాబాద్‌లోని వివిధ ఆలయాలను సందర్శించారు బండి సంజయ్‌. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా సంజయ్‌ గుళ్లకు వెళ్లినా.. బీజేపీ ఆశించిన మైలేజ్‌ అయితే వచ్చిందని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తారు. పైగా గ్రేటర్ ఫలితాలు సైతం 4 స్థానాల నుంచి 48 స్థానాలకు పెంచడంతో తమ అస్త్రాలు లక్ష్యం దిశగా దూసుకెళ్లాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా తెలంగాణ బీజేపీ నాయకులు ఆ దూకుడు కొనసాగిస్తున్నారు. టెంపుల్‌ పాలిటిక్స్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు కాషాయ నేతలు. ఉప్పగూడలోని కాళీమందిరం భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ.. బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ పరిశీలనకు వెళ్లడం పాతబస్తీలో వేడి పుట్టించింది.

ఇదే సమయంలో ఏపీ బీజేపీ చీఫ్‌ సైతం చాలా రోజుల తర్వాత ఆలయాల అజెండాను పట్టుకుని ఉద్యమించారు. కృష్ణా పుష్కరాల సమయంలో కూలగొట్టిన గుళ్లను తిరిగి నిర్మించాలనే డిమాండ్‌తో విజయవాడ దుర్గాఘాట్‌లో ధర్నా చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నేతలు ఎంచుకున్న మార్గం చర్చకు దారితీస్తోంది. తెలంగాణలో మరో రెండేళ్ల వరకు.. ఏపీలో మూడేళ్ల వరకు ఎన్నికలు లేవు. ఇప్పటి నుంచే గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేసుకోవడానికి టెంపుల్స్‌ను బేస్‌గా మార్చుకుంటున్నారో ఏమో.. మెల్లగా రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరి.. ఇది ఏ స్థాయిలో వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version