తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్రమాలకు, పాలనా వైఫల్యాలకు కేంద్రంలోని బీజేపీ అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ సర్కారుకు కేంద్రంలోని బీజేపీ ఎందుకు రక్షణ కల్పిస్తున్నదనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు.
అసలు అమృత్ స్కామ్లో ఎటువంటి అర్హత లేని రేవంత్ సోదరుడికి రూ.1,137 కోట్ల కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని, దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఆర్ఆర్ పన్ను (చదరపు అడుగుకు 150 రూపాయలు) బిల్డర్ల నుంచి వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీనే స్వయంగా చెప్పారని.. అటువంటప్పుడు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ గుర్తుచేశారు.మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు జరిగి 150 రోజుల గడిచినా కేంద్రం రియాక్ట్ కావడం లేదని కేటీఆర్ నిలదీశారు.