వైసీపీ అసమర్థ, అవినీతి పాలన కారణంగా ఏపీ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని అన్నారు బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని మండిపడ్డారు సోము వీర్రాజు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా సొంత ఖాతా నుంచి ఇస్తున్నట్టుగా బటన్ నొక్కుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం వేలకోట్లు ఇస్తుందని అన్నారు.
గత ప్రభుత్వం విజయవాడలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి భూమి ఇచ్చిందని.. ఆ భూమిని వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పేరుతో నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి 35 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల 21న ఏపీలో బిజెపి భారీ బహిరంగ సభను నిర్వహించబోతుందని తెలిపారు. ఆ సభలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని చెప్పారు సోము వీర్రాజు. ఏపీలో బిజెపి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.