ఏపీలోని కర్నూలు జిల్లా కపట్రాళ్ల గ్రామంలో యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలియడంతో తాజాగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. యురేనియం నిక్షేపాలు ఉన్న పరిసర ప్రాంతాల్లోని 4 గ్రామాల ప్రజలు తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. తమను కాదని ఎవరైనా యురేనియం తవ్వకాలు జరిపితే చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. చావనైనా చస్తాం కానీ, తవ్వకాలు మాత్రం జరగనివ్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కౌలుట్ల చెన్నకేశవస్వామి ఆలయం వద్ద గ్రామస్తులు ప్రమాణం చేశారు. కేంద్రం వెంటనే యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనియెడల ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆల్టిమేటం జారీచేశారు. కాగా, కర్నూల్ జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాల కోసం 68 బోర్లు వేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్ చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలపడంతో రిజర్వ్ ఫారెస్ట్‌లోని 6.8 హెక్టార్లలో యూసీఐఎల్ అధికారులు తవ్వకాలు చేపట్టనున్నారు.