దేశ రాజధాని దిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఈ కార్యాలయం నిర్మాణం జరుగుతున్నట్లు వెల్లడించాయి. సర్దార్ పటేల్ మార్గ్ లో జోధ్ పుర్ రాజ వంశీయుల బంగ్లాను లీజుకు తీసుకుని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ ఈ నూతన పార్టీ కార్యాలయాన్ని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వసంత్ విహార్ లో నిర్మాణంలో ఉన్న తెలంగాణ భవన్ పనులు వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే 6 నెలల్లో పార్టీ భవన నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
2021 సెప్టెంబర్ 2 వ తేదీన టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. 1200 చదరపు మీటర్ల విస్తరణంలో భవన నిర్మాణం చేపడుతున్నారు. పార్టీ భవన నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.