రాజ్‌భవన్ నుంచి బయటకు వచ్చిన తరువాత బీజేపీ నేత యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రం 6 నుంచి 6.15 గంటల మధ్య తాను కర్ణాటక సీఎంగా ప్రమాణం చేస్తానని తెలిపారు.
కర్ణాటకలో ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయిన విషయం విదితమే. సీఎం కుమారస్వామి సర్కారు బలపరీక్షలో విఫలమైంది. దీంతో ఆయన ప్రభుత్వం పడిపోయింది. దీంతో అప్పుడు అందరూ బీజేపీ నేత యడ్యూరప్ప సీఎం అవుతారని అనుకున్నారు. అయితే అందుకు బ్రేక్ పడింది. బీజేపీ అధిష్టానం ఆదేశాలతో యడ్యూరప్ప మౌనం పాటించారు. ఇక ఉపేక్షిస్తే నష్టం వస్తుందేమోనని భావించిన ఆ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు యడ్యూరప్పకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయన ఇవాళ సాయంత్రమే కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో కర్ణాటక ప్రభుత్వం మైనార్టీలో పడిపోగా.. ఆ తరువాత అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు బలపరీక్ష నిర్వహించడంతో అందులో కుమార స్వామి సర్కారు మెజారిటీ నిరూపించుకోలేకపోయింది. దీంతో ఆయన సీఎంగా రాజీనామా చేయక తప్పలేదు. అయితే అప్పుడే యడ్యూరప్ప సీఎం అవ్వాల్సి ఉన్నా.. బీజేపీ అధిష్టానం సూచనలతో ఆయన ఇవాళ్టి వరకు ఆగారు. ఇక ఆయనకు పార్టీ అగ్ర నేతలు స్పష్టమైన సమాచారం ఇవ్వడంతో నేడు ఆయన ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను యడ్డీ కోరారు. దీంతో ఆయన అందుకు అంగీకరించారు. ఈ క్రమంలోనే యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు.
రాజ్‌భవన్ నుంచి బయటకు వచ్చిన తరువాత బీజేపీ నేత యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రం 6 నుంచి 6.15 గంటల మధ్య తాను కర్ణాటక సీఎంగా ప్రమాణం చేస్తానని తెలిపారు. ఇందుకు గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారని ఆయన తెలిపారు. అయితే ఇవాళ యడ్డీ ఒక్కరే ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కూడా సమాచారం. మరి ఈ సారి యడ్యూరప్ప ఎంత కాలం సీఎంగా ఉంటారో చూడాలి..!