జియో దెబ్బతో దేశవ్యాప్తంగా టెలికం రంగంలో మిగిలిన సంస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోతున్నాయి. జియో ఎఫెక్ట్ వోడాఫోన్, ఎయిర్‌టెల్ సంస్థలకే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు అయిన బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లాంటి ప్రుత్వ రంగ సంస్థలపై కూడా తీవ్రంగా పడింది. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తమ వెండార్లకు రు. 20వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలోనే వీటిని రాబట్టుకునేందుకు వెండార్లు సైతం ఈ రెండు సంస్థల పై దివాళా స్మృతి చట్టాన్ని ప్రయోగించాలని భావిస్తున్నారు.
ఈ రెండు టెల్కోలతో పాటు రూ.45 వేల కోట్ల భారత్ నెట్ ప్రాజెక్టు టెలికాం గేర్లు, ఇతర ఉత్పత్తులను సరఫరా చేసిన సంస్థలకు దాదాపు రు. 20 వేల కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంది. అయితే బ్యాంకులు మాత్రం తమ బకాయిలు రాబట్టుకునేందుకు సరఫరా సంస్థలపై తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఈ నెల 19న వెండార్లంతా కలిసి బీఎస్ఎన్ఎల్‌కు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. ఈ రెండు సంస్థల దివాళా నేపథ్యంలో ఎంటీఎన్‌ఎల్ తన ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది.
ప్రస్తుతం ఎంటీఎన్‌ఎల్‌లో 22,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపు 15,000 మంది ఈ పథకాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. 2020 జనవరి 31కు 50 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. ఇక ఇప్పుడు ఈ సంస్థల దివాళా నేపథ్యంలో ఇక్కడ నెట్ ప్రాజెక్ట్‌కు విడిభాగాలు, ఇతర ఉత్పత్తులు సరఫరా చేసిన సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ప్రధానమంత్రి మోదీకే నేరుగా విజ్ఞప్తి చేసినా ఎలాంట స్పందనా లేదని తెలుస్తోంది. టెలికాం విడిభాగాలు, ఉత్పత్తుల సరఫరాదారుల విభాగంలో 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కొద్ది వారాలకే లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది.