వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న ఘాటు విమర్శలు చేశారు. తాజాగా ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతి జోలికి వెళ్లడం వల్లే జగన్ ఓటమిపాలయ్యారని మండిపడ్డారు. అమరావతి విధ్వంసానికి కారకుడు ఆయనేనని ఆరోపించారు. జగన్‌ను సైకోగా అభివర్ణించారు. తాను సైకో అని జగన్ మరోసారి నిరూపించుకున్నాడని విమర్శించారు. తన ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎదగనివ్వలేదని, ఉద్దేశపూరంగా దాన్ని చంపేశాడని అన్నారు.
ఆ అవకాశం శాసన మండలిలో లేకపోవడం వల్ల దాన్ని రద్దు చేయడానికి సైతం పూనుకున్నాడని బుద్ధా వెంకన్న అన్నారు. రాజ్యాంగం ప్రకారం.. మండలిని రద్దు చేసుకోలేక పోయాడని వ్యాఖ్యానించారు. అప్పట్లో మండలి సభ్యుడిగా తాను సభలో ఉన్నానని గుర్తు చేశారు. తనతో పాటు సీ రామచంద్రయ్య వంటి సీనియర్లు సభలో ఉన్నారని పేర్కొన్నారు. అప్పట్లో తమకు శాసనమండలిలో బలం ఉండేదని చెప్పుకొచ్చారు. అమరావతిని రాజధానిగా రద్దు చేస్తూ అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని తామందరం కలిసి శాసన మండలిలో ఓడించామని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.