దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసరా పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలకు, వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయించవద్దని సీఈసీ ఆదేశించింది.ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లను పక్కకు పెట్టాలని ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సూచించింది.
అయితే, పెన్షన్ల పంపిణీ నుండి వాలంటీర్లను తొలగించాలని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం వల్లే.. ఈసీ వాలంటీర్లపై ఆంక్షలు విధించిందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా వాలంటీర్లపై ఆంక్షల వ్యవహారంపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెన్షన్ల పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పించడం బాధాకరమని వాలంటీర్లను తప్పించాలని చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం దుర్మార్గమని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బుద్దున్నోడు ఎవడూ ఇలా చేయడు అని చంద్రబాబుపై ఎంపీ అవినాష్ మండిపడ్డారు.చంద్రబాబుకు మెదడు కిందకు జారినట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అవ్వతాతల ఉసురు చంద్రబాబుకు తగలకుండా పోదని వార్నింగ్ ఇచ్చారు.