ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ ప్రయాణికుల బస్సు హైజాక్‌కు గురైనట్లు వచ్చిన వార్తలు పోలీసులను కాసేపు ఉరుకులు పరుగులు పెట్టించాయి. అయితే బస్సు హైజాక్‌కు గురికాలేదని తెలియటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. 34 మంది ప్రయాణికులతో గురుగ్రామ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు ఓ ప్రైవేట్ బస్సు వెళ్తోంది. బస్సును మధ్యలోనే పలువురు ఆపి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. డ్రైవర్, కండక్టర్‌ను దించి వారు బస్సును గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్తుండటం వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సు హైజాక్‌కు గురైందేమోనని భయపడి పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆగ్రాలోని థానా మల్పూర్ ప్రాంతంలో ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సును స్వాధీనం చేసుకున్నది ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. బస్సుపై తీసుకున్న లోన్ ఈఎంఐలు యజమాని చెల్లించకపోవడంతో వారు బస్సును ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఫైనాన్స్ కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. బస్సును ఝాన్సీ ప్రాంతానికి తరలించారు.