నాయకులు ఆదర్శం పలికి నీతులు చెప్పి వాళ్ల అనుచరులు మాత్రం ఇష్టం వచ్చిన విధంగా రెచ్చిపోతే ఆ కథ వినేందుకు విడ్డూరం. చూసేందుకు అసహ్యం. భరించలేని పరిణామాలే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా జరుగుతున్నాయి. సెటిల్ మెంట్ రాజకీయాలు లేదా బెదిరింపులు లేదంటే కొట్టడం లేదంటే తన్నడం ఇవి తప్ప మరొకటి కనిపిస్తే ఒట్టు అన్న విధంగా పరిణామాలు ఉన్నాయి. బాలినేని శ్రీనివాస్ అనుచరుడు మొన్న సుభాన్ రెచ్చిపోయారు.
ఇప్పుడు భైరెడ్డి అనుచరుడు రెచ్చిపోయాడు. ఏం చేసినా కూడా వారికి అధికారం ఉంది కనుక చెల్లుతుంది అన్న మాట మాత్రం బలీయంగా వినిపిస్తోంది విపక్షం నుంచి.. ఫ్యాక్షన్ గొడవులు లేదంటే హత్యా రాజకీయాలు ఇవీ కాదంటే దౌర్జన్యాలు అవీ కుదరకపోతే భూ కబ్జాలు ఈ విధంగా ఒక్కటేంటి ఎన్నో ! అయినా పోలీసులు అడ్డుకోరు. సామాన్యులను డ్యూటీ డాక్టర్లను ఇంకా చాలా మందిని తంతాం, పొడుస్తాం అని బెదిరిస్తుంటే మాకు ఫిర్యాదు మేమేం చేయలేం అని మాత్రమే చెప్పి తప్పుకుంటారు. ఈ కథలో కూడా జరిగింది అదే ! బాధితులు భయపడిపోయి ఫిర్యాదు కాగితంపై సంతకమే చేయలేదు.ఇక కేసు ఎలా కడతారని.. ఎలా ఆగడాలను నియంత్రిస్తారని?
ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో నిన్నటి వేళ ఓ ఫ్యాక్షనిస్టు రెచ్చిపోయారు. తాను శాప్ చైర్మన్ అనుచరుడునని భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పేరు చెప్పి ఓ ఆస్పత్రి ప్రాంగణాన రెచ్చిపోయారు. అదుపు తప్పి ప్రవర్తించారు. దీంతో వివాదం జిల్లాలో పెను సంచలనం అయింది. ప్రస్తుతం ఈ ప్రాంతం ప్రతిపాదిత నంద్యాల జిల్లా పరిధిలోకి వస్తుంది. ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో హత్యా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తిగా భైరెడ్డి అనుచరుడు భాషాకు పేరుంది. దీంతో ఎప్పటిలానే ఆయన తనదైన శైలిలో ఆగ్రహంతో ఊగిపోయారు. నేను తల్చుకుంటే ఏమయినా చేస్తాను.. ఈ ఆస్పత్రి ఇక్కడ ఉండదు కూడా అని ఆస్పత్రి వైద్యులకు హెచ్చరికలు జారీ చేసి గందరగోళ వాతావరణం సృష్టించారు. ఆ వివరం ఈ కథనంలో..
నందికొట్కూరులో ఉన్న సుజాత ఆస్పత్రికి ముచ్చుమర్రి కి చెందిన భాషా తన కూతురితో వచ్చారు. ఆమె గర్భిణి. ఐదు నెలలు నిండాయి. ఆమెకు చికిత్స అందించాక బిల్లు చెల్లించాలని అడిగిన ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు. మర్డర్లు నా వృత్తి నన్నే డబ్బులు అడుగుతావా అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఎట్టకేలకు సాయంత్రం వేళ భైరెడ్డి అనుచరులు సీన్ లోకి వచ్చి ఆస్పత్రి వర్గాలతో చర్చలు జరిపి రాజీ కుదిర్చారు. ఇదీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఓ దయనీయ స్థితి.