మన దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం జనవరి 16వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రస్తుతం మూడో దశలో భాగంగా 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలను ఇస్తున్నారు. అయితే కోవిడ్ టీకాలను వేయించుకుంటున్న చాలా మందికి వస్తున్న సందేహం ఒక్కటే. అది.. టీకా తీసుకున్నాక మద్యం సేవించవచ్చా ? అని.. అయితే ఇందుకు వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే…
కోవిడ్ టీకాను తీసుకున్నతరువాత శరీరంలో యాంటీ బాడీలు తయారు అయ్యేందుకు 3 వారాల సమయం పడుతుంది. అయితే యాంటీ బాడీలపై ఆల్కహాల్ ప్రభావం చూపిస్తుందా, లేదా అనే విషయాన్ని ఇప్పటి వరకు సైంటిస్టులు వెల్లడించలేదు. అలాగే వ్యాక్సిన్ తయారీ సంస్థలు కూడా టీకాను తీసుకున్నాక ఆల్కహాల్ సేవించవద్దని చెప్పలేదు. అందువల్ల టీకాలను తీసుకున్న తరువాత మద్యం సేవించవచ్చా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వస్తుంది.
కానీ ఆల్కహాల్‌ను సేవించడం వల్ల మన శరీర నిరోధక శక్తి సహజంగానే తగ్గుతుంది. టీకాను తీసుకున్న తరువాత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కనుక ఆల్కహాల్‌ను సేవిస్తే దానిపై వ్యతిరేక ప్రభావం పడేందుకు అవకాశం ఉంటుంది. కనుక టీకా అనంతరం మద్యం సేవించకపోవడమే మంచిది. అయితే తప్పదు అనుకునే వారు డాక్టర్ సలహా మేరకు మద్యం సేవించవచ్చు. అది కూడా పరిమిత మోతాదులో మాత్రమే. అధికంగా మద్యం సేవిస్తే టీకా తీసుకున్నా ప్రయోజనం ఉండదు. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.