తెలంగాణలో 100 మిలియన్ డాలర్ల మరో భారీ పెట్టుబడి…

-

తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి భారీ పెట్టుబడుల విలువ కొనసాగుతూనే ఉన్నది. తాజాగా ఈ రోజు కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్ తెలంగాణలోని జీనోమ్ వ్యాలీలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. జీనోమ్ వ్యాలీలో సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు 740కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటన చేసింది.

కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ సుమారు సుమారు 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం మేర ల్యాబ్ స్పేస్ లో ఈ పెట్టుబడిని వినియోగించ నున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ పెట్టుబడి ప్రకటన సమావేశంలో ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్ యెక్క ఇండియా ఎండి చాణక్య చక్రవర్తి, శిల్పి చౌదరి,హరే కృష్ణ, సంకేత్ సీన్హా వంటి సంస్థ సీనియర్ ప్రతినిధులు మంత్రి కే. తారకరామారావు తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తమ సంస్థ జీనోమ్ వ్యాలీలో ఉన్న ఎంయన్ పార్క్ లో పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఒక ప్రముఖ కెనెడియన్ ఫండ్ దక్షిణాసియాలో మొదటిసారిగా లైఫ్ సైన్సెస్ రంగంలో ఇంత భారీ పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపింది.

ఈరోజు ఇవాన్ హొ కేంబ్రిడ్జ్ భారీ పెట్టుబడి ద్వారా లైఫ్ సైన్సెస్ రంగ మౌలిక వసతుల కల్పనలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు. భారతదేశం యొక్క అతిపెద్ద లైఫ్ సైన్సెస్ రంగ పరిశోధన మరియు అభివృద్ధి క్లస్టర్ అయిన జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 200కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ కార్యకలాపాలలు కొనసాగిస్తున్నాయని తాజాగా ఈ పెట్టుబడి ద్వారా ప్రభుత్వం యొక్క లైఫ్ సైన్సెస్ రంగ ఫోకస్కు ఊతం లభిస్తుందన్నారు.

ఈ పెట్టుబడి ద్వారా జీనోమ్ వ్యాలీలో మరింత లాబరేటరీ స్పేస్ పెరగడంతో పాటు పరిశోధన, అభివృద్ధి మరియు లైఫ్ సైన్సెస్ అనుబంధ మౌలిక వసతులు రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత భారీ పెట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్న కంపెనీకి మంత్రి కే. తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ పెట్టుబడికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తామని ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ కి మంత్రి కే. తారకరామారావు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news