కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి కాకతీయ కెనాల్‌లో కారు లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది. నిన్నటి వరకూ కెనాల్ లో నిండా నీరుండగా, అధికారులు నీటి విడుదలను నిలిపివేయగానే, కారు బయటకు కనిపించింది. యాదాలపల్లి సమీపంలోని అలుగునూరు వద్ద కెనాల్ లో కారును గమనించిన స్థానికులు, విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఈ కారు దాదాపు రెండు వారాల క్రితమే నీటిలో పడి వుండవచ్చని నిర్ధారించిన పోలీసులు, కారులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను గుర్తించారు. కారు నీటిలో పడి 15 రోజులు గడవడంతోనే మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయని తెలిపారు.
అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ రెండు మృతదేహాలూ పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లెలు రాధ, ఆమె భర్త లక్ష్మీపూర్ కు చెందిన సత్యనారాయణరెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ రెండు వారాలకు పూర్వం తమ కుమార్తె వినయ శ్రీతో కలసి బయలుదేరారని, అప్పటి నుంచి అదృశ్యమయ్యారని పోలీసు కేసు కూడా నమోదైంది. అదే రోజున వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక కారులో వినయశ్రీ మృతదేహం కనిపించకపోవడంతో ఆమె కోసం గాలింపు తీవ్రతరం చేశారు. చెల్లులు, బావ మరణంతో కుంగిపోయిన మనోహర్ రెడ్డిని పలువురు రాజకీయ, పుర ప్రముఖులు ఓదార్చారు.