బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర నటించిన కొత్త చిత్రం ‘థ్యాంక్ గాడ్’. అయితే ఈ చిత్రం ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌లోని కొన్ని సంభాషణలు వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ లాయర్ హిమాన్షు శ్రీవాత్సవ.. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర, దర్శకుడు ఇంద్ర కుమార్‌పై కేసు నమోదైంది.
“అజయ్ దేవ్‌గణ్ సూటు వేసుకుని, చిత్ర గుప్తుడి పాత్రలో అభ్యంతరకర భాషలో జోకులు వేశారు. చిత్ర గుప్తుడు అంటే పాప కర్మలు లెక్కించేవారు. మనుషుల మంచి చెడులను రికార్డు చేస్తారు. దేవుళ్లను అలా చూపిస్తే.. అది మతం మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది” అని హిమాన్షు తన పిటిషన్లో పేర్కొన్నారు. పిటినషనర్ స్టేట్మెంట్ను కోర్టు నవంబర్ 18న రికార్డు చేయనుంది.
కాగా, ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. సిద్ధార్థ్ కారు ప్రమాదానికి గురైన సన్నివేశంతో ప్రారంభమైన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంది. ఎమోషన్ ప్లస్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దాదాపు 3 నిముషాలు ఉన్న ఈ ట్రైలర్లో సూట్లో వచ్చిన అజయ్ దేవ్‌గణ్.. సిద్ధార్థ్ బలహీనతలను వరుసగా చెబుతాడు. చివరలో ఓ జోక్ పేలుస్తాడు. ఈ సినిమా అక్టోబర్ 25న విడుదల కానుంది.